Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు తిక్క కాదు..బరాబర్ లెక్కుంది

By:  Tupaki Desk   |   23 Oct 2017 7:26 AM GMT
కేసీఆర్‌ కు తిక్క కాదు..బరాబర్ లెక్కుంది
X
డైలాగ్ అందరికే తెలిసిందే...నాక్కొంచె తిక్కుంది...కానీ లెక్కుంది. సినిమాలో డైలాగ్ అయిన‌ప్ప‌టికీ....నిజ జీవితంలో కూడా చాలామంది దీన్ని ఫాలో అవుతుంటారు. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిని ఈ కోణంలో చూడ‌క‌పోవ‌డం వ‌ల్ల కొంద‌రు విప‌క్ష నేత‌లు అన‌వ‌స‌రంగా ఆవేశ‌ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న గురించి. తెలంగాణలో నిజమైన గ్రామస్వరాజ్యాన్ని స్థాపించే దిశగా కీలక చర్యలు తీసుకొంటున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని గిరిజన గూడేలు - లంబాడా తండాలు - గోండు గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణబిల్లును ప్రవేశపెడుతామని తెలిపారు. ఇతర రాజకీయపార్టీల మాదిరిగా పారిపోకుండా నిర్దేశిత సమయానికే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8684 గ్రామ పంచాయతీలకు అదనంగా మరో నాలుగు నుంచి అయిదువేల కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తామని వ‌రంగ‌ల్‌ లో కేసీఆర్ ప్ర‌క‌టించారు. 600 జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఏర్పాటు ఉంటుందని ఆయన వివరించారు. అన్ని గ్రామాలకూ నిర్దిష్టంగా నిధులు ఇచ్చేవిధంగా బడ్జెట్‌ లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని సీఎం పేర్కొన్నారు. గ్రామస్వరాజ్యానికి కొత్త అర్థం ఇచ్చే రీతిలో పంచాయతీరాజ్ చట్టానికి సమూల మార్పులు చేసి రాష్ట్రంలో గ్రామసీమలను స్వర్గసీమలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

అయితే ఇన్నాళ్లు విమ‌ర్శ‌లు చేసిన‌...కేసీఆర్ గురించి దుమ్మెత్తిపోస్తున్న విప‌క్షాలు ఇప్పుడు కేసీఆర్ లెక్క‌ల‌ను అర్థం చేసుకోవాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. వ‌చ్చే ఏడాది ఎలాగూ పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు కొత్త పంచాయ‌తీల అంశం తెర‌మీద‌కు తీసుకున్నారు. పోనీ ఇన్నాళ్లుగా చేసేయ‌చ్చు క‌దా అంటే..దానికి మ‌ళ్లీ లెక్క‌లే. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. అలా తీసుకుంటే...విభ‌జించిన గ్రామ‌పంచాయ‌తీల్లో విబేధాలు వ‌స్తాయి. సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చ‌క‌పోవ‌చ్చు కూడా. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టేస్తే...అన్నింటికంటే ముఖ్యంగా నిధుల కేటాయింపు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌థ‌కాల‌కు భారీస్థాయి నిధులు కేటాయిస్తున్న క్ర‌మంలో మ‌రో ప్రాజెక్టు కేటాయించే ప‌రిస్థితి లేదు. పోనీ నిధులు కేటాయించ‌కుండా అలా వ‌దిలేస్తే..అదో త‌లనొప్పి..అందుకే ఇన్ని రోజులు పెండింగ్‌ లో పెట్టి..ఇప్పుడు కొత్త పంచాయ‌తీల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.