Begin typing your search above and press return to search.

ఐదేళ్ల‌కు సొంతూరు అభివృద్ధి గుర్తుకొచ్చిందా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   4 July 2019 4:34 AM GMT
ఐదేళ్ల‌కు సొంతూరు అభివృద్ధి గుర్తుకొచ్చిందా కేసీఆర్‌?
X
అంగ‌ట్లో అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శ‌ని అన్న పాత‌కాల‌పు సామెత ఒక‌టి గుర్తుకొస్తుంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ య‌వ్వారాలు చూస్తున్న‌ప్పుడు. తెలివైనోడు.. విజ‌న్ ఉన్నోడు.. ఏమైనా చేయాలంటే ప‌ట్టుబ‌ట్టి చేసేటోడు.. అనుకుంటే అసాధ్యాన్ని సాధ్యం చేసేటోడు.. ఇన్ని ఉన్న కేసీఆర్ కు నిల‌క‌డ‌.. క‌మిట్ మెంట్ ఉండే విష‌యంలోనే లెక్క త‌ప్పుతుంటాడు.

ద‌రిద్రం కాకుంటే ఏమిటి చెప్పండి? కేసీఆర్ లాంటోడు రైతుల విష‌యంలో సుదీర్ఘంగా ఆలోచించి ప‌థ‌కం తెర మీద‌కు తెస్తే.. మ‌రో మాట‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా నిర్మోహ‌మాటంగా కాపీ కొట్టేశారు మోడీ మాష్టారు. ప్ర‌ధాని లాంటోడికి సైతం టెంప్ట్ చేసేలా ప‌థ‌కాల్ని రూపొందించ‌టంలో దిట్ట‌గా కేసీఆర్ ను చెప్పాలి. మ‌రి.. అలాంటి దూర‌దృష్టి ఉన్నోడికి సొంతూరు స‌మ‌స్య‌లు ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఒక ట‌ర్మ్ ముగిసి.. రెండో ట‌ర్మ్ చేపట్టిన ఆర్నెల్ల‌కు కానీ గుర్తుకు రావా? అన్న క్వ‌శ్చ‌న్ రాక‌పోదు.

కొంత‌మంది నేత‌లు ప్ర‌పంచ విజ‌న్ ఉన్నోళ్లు ఉంటారు. అలాంటోళ్ల‌కు సొంతూరు.. అత్త‌గారి ఊరు.. బామ్మ‌ర్ది ఊరు లాంటివేమీ ఉండ‌వు. విశ్వం మొత్తం వారిదే. వారి ఆలోచ‌న‌ల్ని గ్లోబ‌ల్ రేంజ్ లో ఉంటాయి. మ‌న కేసీఆర్ అలాంటి విజ‌న్ ఉందా? అంటే అలాంటిదేమీ ఉన్న‌ట్లు క‌నిపించదు. ఎందుకంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు స్వ‌ల్ప‌కాలిక ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి.. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌న‌ట్లు క‌నిపించ‌దు.

ఆ మ‌ధ్య‌న ఒక్కో కులానికి ఒక్కో కుల భ‌వ‌నం ఏర్పాటు చేస్తే.. అంద‌రిని సంతృప్తి ప‌ర్చిన‌ట్లుగా అనిపించ‌టం.. ఒక సీజ‌న్ మొత్తం అలాంటి హామీల‌తో బండి లాగించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. ఒక సీజ‌న్ మొత్తం కుల భ‌వ‌నాల మీద ఇచ్చే హామీల‌తో లాగించేసిన గులాబీ బాస్‌.. అందులో ఒక్క‌టంటే ఒక్క భ‌వ‌నాన్ని పూర్తి చేశారా? అంటే.. క‌నీసం ఫిల్ల‌ర్ల స్థాయికి తెచ్చిన భ‌వ‌నాలు కూడా క‌నిపించ‌వు.

ఆలోచ‌న‌లు బోలెడ‌న్ని ఉన్నా.. అలాంటి వాటిని ఆచ‌ర‌ణ‌లోకి తేవాల‌న్న‌ ధ్యాస కేసీఆర్ లో ఉన్న‌ట్లుగా కనిపించ‌దు. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తోచిన హామీల్ని ఇచ్చేయ‌ట‌మే త‌ప్పించి.. వాటిని పూర్తి చేద్దామ‌న్న ధ్యాస ఉన్నట్లుగా అనిపించ‌దు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ గా తాజా ఎపిసోడ్ ను చెప్పాలి. త‌న సొంతూరైన చింత‌మ‌డ‌కలోని స‌మ‌స్య‌ల చిట్టా త‌యారు చేయించాల‌ని కేసీఆర్ సారుకు ఐదేళ్ల త‌ర్వాత గుర్తుకొచ్చింది. అది కూడా త‌న ఊరోళ్ల‌తో క‌లిసి ఆత్మీయ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యాక‌.

తాజాగా చింత‌మ‌డ‌క స‌ర్పంచ్ హంస‌కేత‌న్ రెడ్డికి ఫోన్ చేసిన కేసీఆర్‌.. గ్రామంలోని స‌మ‌స్య‌ల‌న్నింటి మీదా ఒక నివేదిక త‌యారు చేయించాల‌ని కోరారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామ‌ని ఆయ‌న‌కు చెప్పారు. సొంతూరును అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు.. కానీ.. అలాంటి భావ‌న ఐదేళ్ల త‌ర్వాత‌.. అందునా తాను అక్క‌డో ప్రోగ్రామ్ పెట్టిన‌ప్పుడు రావ‌టంపైనే అభ్యంత‌ర‌మంతా. సొంతూరుకు ఏదో చేయాల‌న్న భావ‌న సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్ లాంటోడికి ఐదేళ్ల‌కు రావ‌టం ఏమిటి?