Begin typing your search above and press return to search.

ములాజు లేకుండా కేసీఆర్‌ని కుట్టే వాడున్నాడు

By:  Tupaki Desk   |   3 July 2015 2:30 PM GMT
ములాజు లేకుండా కేసీఆర్‌ని కుట్టే వాడున్నాడు
X
రాజమౌళి పుణ్యమా అని ఈగ ఎంత పవర్‌ఫుల్‌ అన్న విషయం సామాన్యుడికి తెలిసింది. నిజానిజాల సంగతి పక్కన పెడితే.. ఈగ సినిమా పుణ్యమా అని ఈగ మీద చాలామందికి ప్రేమ పెరగటం తెలిసిందే. అదే విధంగా వివిధ ప్రాణుల మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. మిగిలిన వాటితో పోలిస్తే.. చాలా సందర్భాల్లో చిరాకు పుట్టించటమే కాదు.. ఎలాంటి వారినైనా సరే పండబెట్టే శక్తి దోమకు మాత్రమే ఉంది.

ఈగ ఏంది? దోమ ఏంది? అన్న సందేహం అక్కర్లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దోమ గురించి చెప్పటమే కాదు.. అదెంత పవర్‌ఫుల్‌ అన్న విషయాన్ని వివరంగా చెప్పటమే కాదు.. ఆ జాతి మొత్తం సోషలిస్టులు అన్న బిరుదు కూడా ఇచ్చారు. అసలుసిసలు సోషలిస్టులు కేసీఆర్‌ వ్యాఖ్యలకు ఎంత ఫీలవుతారో తెలీదు కానీ.. కేసీఆర్‌ మాటలు మాత్రం పలువురిని ఆకర్షించేలా ఉన్నాయి.

విషయం ఏదైనా.. అందరిని ఆకట్టుకునేలా మాట్లాడే మంచి వక్త అయిన కేసీఆర్‌.. హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా దోమల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ.. దానికి తనదైన శైలిలో మసాలా జోడించి చెప్పుకొచ్చిన అంశం పలువురిని ఆకట్టుకునేలా ఉంది.

చిలుకూరులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా దోమలు సోషలిస్టులు అని చెప్పుకొచ్చారు వాటికి ధనిక.. పేద అన్న తేడా ఉండదని ఎవరినైనా కుట్టి పారేస్తాయని చెప్పారు. అందుకే దోమను సోషలిస్టు అనాలని.. ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయాని కానీ అది కుట్టేస్తుందని.. కుట్టే ముందు తాను కుట్టేది ఎవరన్న విషయాన్ని దోమ అస్సలు పట్టించుకోదని తేల్చారు.

దోమ కుడితే మలేరియానో.. చలి జ్వరమో వస్తుందని.. అప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని.. అందుకే దోమలు లేకుండా చూడాలని.. అలా చేయాలంటే చెత్త లేకుండా చూసుకోవాలని.. చెత్త ఎక్కడ ఉంటే అక్కడికి దోమలు వస్తాయని చెప్పారు. చెత్త లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండని చెప్పటానికి కేసీఆర్‌ ఎంత బాగా పిట్టకథ చెప్పారో కదా.