Begin typing your search above and press return to search.

మీరు విశ్వ గురువులా...? విష పురుగులా...?: మోడీని ఏకేసిన‌ కేసీఆర్

By:  Tupaki Desk   |   11 July 2022 4:04 AM GMT
మీరు విశ్వ గురువులా...? విష పురుగులా...?: మోడీని ఏకేసిన‌ కేసీఆర్
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు స‌హా బీజేపీ నేత‌ల‌పై టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ''మీరు విశ్వ‌గు రువులా.. విష పురుగులా?'' అంటూ ప్ర‌ధాని మోడీని ఏకేశారు. ప్ర‌పంచంలో తెలియ‌ని వాళ్లు మోడీని న‌మ్ముతార‌ని.. అందుకే విశ్వ‌గురువుగా ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని అన్నారు. ఇక‌, బీజేపీ నేత‌లు త‌ర‌చుగా చేస్తున్న ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ మండి ప‌డ్డారు. డేట్ ఫిక్స్ చేయండి.. అసెంబ్లీని ర‌ద్దు చేస్తా! అని వారికే స‌వాల్ రువ్వారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

"కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. నేను కూడా అసెంబ్లీని రద్దు చేస్తా. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తాం. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్ షిండేలను తీసుకురావాలి" అని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేసీఆర్.. ప్రధాని మోడీ దేశంలో అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నడుస్తోందని తెలంగాణ సీఎం.. కేంద్రంలో సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ అన్నారు. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అని కేసీఆర్ నిల‌దీశారు.

''ఏక్‌నాథ్ షిండే... తోక్‌నాథ్ షిండే లాంటి శిఖండులను ప్రయోగించి కుటిలనీతి తో మీ సామ్రాజ్యాలను నిర్మిస్తారా...?'' అని బీజేపీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ''మేము తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మారుస్తాం. LICని అమ్మనీయం. నాన్ బీజేపి రాష్ట్రాల్లోనే పర్‌క్యాపిటా ఇన్‌కం ఎక్కువ. డబుల్‌ఇంజన్ కావాలి అంటే... మొదట మారవలసింది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజనే. కేంద్రంలో తెలంగాణ వంటి సమర్ధ ప్రభుత్వం రావాలి. కేంద్రంలో పీయూష్ గోల్‌మాల్ అనే మంత్రి ఉన్నాడు. తెలంగాణ ప్రజలను నూకలు తినండి అని ఎగతాళిగా మాట్లాడుతాడా...? అంత అహంకారమా...?'' అని కేసీఆర్ మండిప‌డ్డారు.

''2014లో ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి వెళ్ళండి అని మీరు చెప్తే ఒప్పు.. ఇప్పుడు మేము చెప్తే తప్పా..? గతంలో 400 ఉన్న సిలిండర్ నేడు 1100 దాటింది నిజం కాదా?'' అని కేసీఆర్ ఫైర‌య్యారు. తెలంగాణ ప్ర‌జ‌లు స‌చ్చినా టీఆర్ ఎస్‌ను వ‌దులుకోర‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే జాతీయ పార్టీని ప్ర‌క‌టిస్తామ‌న్నారు. దీనికి సంబంధించిన అజెండాను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. దేశ ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని.. ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

''మాతోని గోక్కుంటే.. అగ్గితోని గోక్కున్న‌ట్టే. నువ్వు గోకినా గోక‌కున్నా.. నేను నిన్ను గోకుతూనే ఉంటా!'' అని కేసీఆర్ మోడీకి వార్నింగ్ ఇచ్చారు. త‌న‌పై దాడులు చేయిస్తామ‌న్న బీజేపీ నేత‌ల‌కు కౌంటర్ ఇచ్చారు. ''రండి నాకాన ఏముందో చూద్దురు. వ్య‌వ‌సాయ భూమి ఉంది. అంత‌కు మించి నాద‌గ్గ‌ర రూపాయి లేదు. లంగ‌, దొంగ‌త‌నం చేస్తే.. భూములు వ‌స్త‌యా? మోడీ చిల్ల‌ర మాట‌ల‌కు పిట్ట‌బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.