Begin typing your search above and press return to search.

ట్రంప్ కు ప్రచారం చేసుడా అంటూ ఫైర్ అయిన కేసీఆర్.. జార్ఖండ్ మాటేంటి?

By:  Tupaki Desk   |   4 March 2022 4:03 AM GMT
ట్రంప్ కు ప్రచారం చేసుడా అంటూ ఫైర్ అయిన కేసీఆర్.. జార్ఖండ్ మాటేంటి?
X
ఒక వేలు ఎదుటోళ్ల వైపు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మన వైపు చూపిస్తాయన్న చిన్న విషయాన్ని చాలా మంది మేధావులు తరచూ మరిచిపోతుంటారు. రాజకీయ నేతలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తమకు ఏది కన్వీనియంట్ గా.. కంఫర్ట్ గా ఉంటుందో దాన్ని మాత్రమే చెబుతారు. కొన్ని సందర్భాల్లో తాము ఖండించిన విషయాల్నే తాము చేస్తుంటారు.అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మినహాయింపేమీ కాదు. గతానికి భిన్నంగా ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి.. ఘాటు విమర్శలు చేయటమే కాదు.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యమ్నాయంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మోడీ మీద ఫైర్ అయ్యే క్రమంలో.. వరుస మీడియా సమావేశాల్ని ఏర్పాటు చేసిన ఆయన.. ఆ మధ్య మాట్లాడుతూ.. అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రంప్ కు అనుకూలంగా ఓటేయాలని కోరుడేంది? ఇదేనా దేశ ప్రధాని చేసే పని? అంటూ విరుచుకుపడ్డారు. ఒక విధంగా చూస్తే.. అందులోనూ పాయింట్ ఉందనే చెప్పాలి. ఒక దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ.. దేశం కాని దేశానికి వెళ్లి.. డొనాల్డ్ ట్రంప్ ను తర్వాత వచ్చే అధ్యక్ష ఎన్నికలకు అనుకూలంగా ఓటు వేయాలని కోరటం హద్దులు దాటటమే. తన పరిధిని అతిక్రమించటమే.

ఈ విషయాన్ని తప్పు పట్టి.. వేలెత్తి చూపించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు చేస్తున్నదేమిటి? అన్నది ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. ఆ మధ్యన దేశ సరిహద్దుల్లో చైనా దాడికి వీర మరణాన్ని పొందిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించటం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అమర జవాను కుటుంబంతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందిన అమరజావన్ల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఒక విధంగా దీన్ని సమర్థించాల్సిందే. దేశ సరిహద్దుల్ని కాపాడే క్రమంలో ప్రాణాలు విడిచిన అమర సిపాయి రాష్ట్రాలకు అతీతంగా అందరికి కావాల్సిన వాడే. అతడి కుటుంబాన్ని అన్ని రాష్ట్రాలు చేయూతను ఇవ్వటం తప్పేం కాదు.

కానీ.. ఈ పేరుతో తనకు సంబంధం లేని రాష్ట్రానికి వెళ్లి.. అక్కడి ముఖ్యమంత్రికి తమ రాష్ట్రం తరఫున సాయం అందిస్తామంటూ చేసే సీన్ తోనే అభ్యంతరం. నిజంగానే.. అమర జవాను కుటుంబాన్ని ఆదుకోవటం.. వారికి అండగా నిలవటమే ముఖ్యమైనప్పుడు.. ఆ కుటుంబాల వారిని హైదరాబాద్ కు పిలిపించి.. సాదరంగా ఆహ్వానించి.. సైనిక వీరుడి త్యాగాన్ని స్మరిస్తూ.. వారికి తాము ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయాన్ని అందించటం బాగుంటుంది. అందుకు భిన్నంగా జాతీయ రాజకీయాల మీద కన్నేసిన కేసీఆర్.. అమరవీరుల పేరుతో రాజకీయాన్ని నడపవటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. శుక్రవారం జార్ఖండ్ వెళ్లి.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరేన్ ను కలిసి.. వారి అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కుల్ని అందజేయనున్నారు. ఇదంతా చూసినప్పుడు.. అప్పుడెప్పుడోజరిగిన ఉదంతానికి సంబంధించి అప్పట్లోనే ప్రకటనను చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు టైమ్లీగా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి.. రాజకీయ ప్రయోజనం కోసం వీర సైనికుడి కుటుంబాన్ని వాడేసిన తీరు చూసినప్పుడు..ఎదుటోళ్లకు నీతులు చెప్పటమే కాదు.. మనం కూడా పాటించాలన్న మాట చప్పున గుర్తుకు రాక మానదు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర సీఎం హడావుడి సబబేనంటారా?