Begin typing your search above and press return to search.

మోడీ పాలనను ఏకి పారేసిన కేసీయార్

By:  Tupaki Desk   |   13 Feb 2023 12:20 PM GMT
మోడీ పాలనను ఏకి పారేసిన కేసీయార్
X
తెలంగాణా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీయార్ అద్భుతమైన ప్రసంగం చేశారు అని చెప్పారు. చాలా కాలం తరువాత కేసేయార్ స్పీచ్ లో ఫైర్ కనిపించింది. అంతే కాదు పూర్తి కంటెంట్ తో సాధికారిక సమాచారంతో ఆయన తొమ్మిదేళ్ళుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమి చేస్తోందో స్పష్టంగా చెప్పారు. అంతా బాగుంది అని అనుకోవడం కాదు, ఏమీ బాగులేదు ఇది వాస్తవం అంటూ గణాంకాలతో సహా కేసీయార్ సభ ముందు వివరాలు ఉంచారు.

నిజానికి ఒక అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి చర్చ పెద్దగా ఉండదు. తమ ప్రభుత్వం గురించే చెప్పుకుంటారు. రాజకీయ సభలలో మాత్రమే ఇలాంటివి ఉంటాయి. దానికి భిన్నగా కేసీయార్ సుదీర్ఘంగా చేసిన ప్రసంగం అంతా మోడీ మీదనే సాగింది. ఆయన మోడీని ఒక దశలో అత్యంత విఫల ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది ఆయనే అనేశారు.

అంతే కాదు మోడీ దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసారు అని నిందించారు. అదాని వల్ల ఈ దేశంలో పది లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని కేసీయారు గుర్తు చేశారు. అదానీ గ్రూప్ లో ఎల్‌ఐసి చాలా పెట్టుబడులు పెట్టిందని, స్కాం బయటపడినప్పటి నుండి బిలియన్లు ఆవిరైపోయాయని కేసీయార్ ఆవేదన వ్యక్తం చేశారు.

అదానీ విషయంలో కేంద్రం ఏమి చేస్తుంది, మోడీ ఏమి చెబుతారు అని దేశమంతా ఆసక్తిగా చూస్తే పార్లమెంట్ లో మోడీ మాట్లాడినది వేరేగా ఉందని, ఆయన అసలు సబ్జెక్ట్ ని పక్కన పెట్టి ఏవేవో మాట్లాడారు అంటూ నిప్పులు చెరిగార్. ప్రతిపక్షాలు అదానీ స్కాం విషయంలో జాయింట్ యాక్షన్ కమిటీని వేయమన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని ఆయన మండిపడ్డారు.

దేశంలో ఉన్న కోట్లాది ప్రజలను నిరాశపరచేలా మోడీ పార్లమెంట్ తో అత్యంత జుగుప్సాకరమైన ప్రసంగాన్ని చేశారని కేసీయార్ దుయ్యబెట్టారు. దేశంలో అభివృద్ధి లేదని, వృద్ధి రేటు తగ్గిపోయిందని, కాంగ్రెస్ ఏలుబడిలోనే ఎన్నో విజయాలు దేశానికి ఆర్ధిక రంగంలో దక్కాయని కేసీయార్ చెప్పుకొచ్చారు. నాడు వృద్ధి రేటు 6.8 శాతం ఉందని అయినా మన్మోహన్ బయటకు చెప్పుకున్నారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ విజయాలను సైతం పెద్దగా ప్రచారం చేసుకోలేదని, అదే మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటూ గొప్ప చెప్పుకుంటోందని కేసీయార్ మండిపడ్డారు. దేశంలో పదేళ్ల పాలన మీద ఎన్నో కధనాలు మీడియా ముఖంగా వస్తున్నాయని సహేతుకమైన ఆధారాలతో అవి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అదానీ ఎపిసోడ్‌పై ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ కథనం భారతీయ పెట్టుబడిదారీ విధానానికి పరీక్ష అని రాసిన సంగతి బీజేపీ పెద్దలకు తెలియదా అని పేర్కొన్నారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్నో వాస్తవాలను దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి చెప్పిందని కేసీయార్ ఆయా గణాంకాలను ఉదహరిస్తూ మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అదే విధంగా జర్నలిస్టు పూజా మెహ్రా రాసిన ది లాస్ట్ డికేడ్ పుస్తకాన్ని ఆయన ప్రస్తావించారు.

మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఒక్క తెలంగాణాకే మూడు లక్షల కోట్ల ఆదాయం కోత పడిందని అన్నారు. ఇంత దారుణమైన ఆర్ధిక వ్యవస్థతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. 2014లో ప్రజలు మోడీని నమ్మి అధికారాన్ని అప్పగిస్తే తొమ్మిదేళ్ళుగా దేశం అంధకారంలోకి నెడుతూనే ఉన్నారని అన్నారు.

ఈ రోజున అమెరికా ఆర్థిక వ్యవస్థ 25 ట్రిలియన్‌ డాలర్లు కాగా చైనా ఆర్థిక వ్యవస్థ 18.3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని అదే సమయంలో . 192 దేశాల్లో తలసరి ఆదాయం లెక్క తీస్తే బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కూడా ముందుండగా భారత్ 139వ స్థానంలో ఉందని ఇదేనా అభివృద్ధి అని ఆయన నేరుగా మోడీని నిలదీశారు. మన దేశ తలసరి ఆదాయమే అసలు కథను వెల్లడిస్తుందని ఆయన అన్నారు.

మోడీ ప్రధాని అయ్యాక గత తొమ్మిదేళ్ళలో 20 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారంటే ఇదేనా సాధించిన ప్రగతి అని కేసీయార్ ప్రశ్నించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న బీజేపీ ప్రభుత్వ లక్ష్యంపై చర్చకు పిలుపునిచ్చిన కేసీఆర్ ఈ రోజున అదే జోక్‌గా మారిందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రచారాల తర్వాత, భారతదేశం కేవలం 3.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారిందని ఆయన అన్నారు. కనీసం లక్ష్యమైనా ఉన్నతంగా ఉండాలన్నది కూడా బీజేపీ పెద్దలకు తట్టడంలేదని ఎద్దేవా చేశారు. దేశం పట్ల నిబద్ధత, దార్శనికత కలిగి ఉండి కలలు కనే ధైర్యం కేంద్ర పెద్దలకు ఉండాలని మోడీ మీద సెటైర్లు వేశారు.

తాను చెప్పే వాటిలో అబద్దాలు ఏమైనా ఉన్నాయా అని మోడీనే సూటిగా ప్రశ్నించడం విశేషం. ఇక లాభం లేదని, 2024లో కేంద్రంలో బీజేపీ సర్కార్ గద్దె దిగాల్సిందే అని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా ఇంత పెద్ద దేశంలో ఎందరో మోడీని విమర్శించారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గణాంకాలను దగ్గర పెట్టుని నిండు శాసనసభలో గంటల పాటు దేశ ప్రధానిని గట్టిగా విమర్శిస్తూ ధీటైన ప్రసంగం చేయడం మాత్రం లేదనే చెప్పాలి. కేసీయార్ ప్రసంగం విన్న వారు ఎవరైనా ఆయనతో కచ్చితంగా ఏకీభవిస్తారు అనే అంటున్న్నారు. మరి దీనికి మోడీ అండ్ టీం ఏ విధంగా జవాబు ఇస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.