Begin typing your search above and press return to search.

తప్పు ఎత్తి చూపిస్తే..పరాయి రాష్ట్రపోడవుతాడా?

By:  Tupaki Desk   |   16 Sep 2019 6:30 AM GMT
తప్పు ఎత్తి చూపిస్తే..పరాయి రాష్ట్రపోడవుతాడా?
X
తప్పును ఎత్తి చూపిస్తే సహించలేని తత్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదట్నించి ఉన్నదే. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నిర్ణయం సరైనది తీసుకుంటారని చెప్పలేం. అలా జరిగిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. వాటిల్లో లోపాలు చెప్పి.. ఆ వాదన సరికాదని కొట్టిపారేయాలి. అంతే తప్పించి.. అందుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయటం.. ఇష్యూను డైవర్ట్ చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేవలం తెలంగాణ వారు మాత్రమే పోరాడారా? తెలంగాణ ప్రాంతవాసుల వాదనలో అర్థం ఉందంటూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంతమంది గళం విప్పలేదు. ఒక్క ఆంధ్రా ప్రాంతం మాత్రమే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని గుర్తించి వారికి దన్నుగా ఉన్నప్పుడు స్వాగతించిన పెద్దమనిషి.. అదే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భావించి పెదవి విప్పితే.. నీ రాష్ట్రం ఏంది? నువ్వు మాట్లాడేంది? అన్న మాటల్లో అర్థం ఏమైనా ఉంటుందా?

మా రాష్ట్రం.. మాకు మాత్రమే సొంతం. మేం మంచిగా చేసుకుంటామో.. చెడు చేసుకుంటామో మా ఇష్టమన్న మాటలే చెప్పదలుచుకున్నప్పుడు.. అందుకు కట్టుబడి ఉండాలి. అలాంటి మాటలు చెప్పే పెద్దమనిషి.. తన రాష్ట్రం తప్పించి.. మరే రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కానీ.. కేసీఆర్ తీరు వేరు. తన ఏలుబడిలో ఉన్న తెలంగాణలో తన ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. సహించలేని గులాబీ బాస్.. ఆంధ్రా ప్రాంతం గురించి.. అక్కడి పాలకులు తీసుకున్న నిర్ణయంలోని మంచి చెడ్డల గురించి ఎలా మాట్లాడతారు?

ఔరోకి షాదీమే అబ్దుల్లా బేగానా.. అన్నట్లు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణది తెలంగాణ ప్రాంతం కాదని.. ఆంధ్రావాడని.. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకాలకు వినియోగించే విద్యుత్ మీద విమర్శలు చేయటానికి ఆయనెవరు? అంటూ ప్రశ్నించటం చూస్తే.. కేసీఆర్ తీరును తప్పు పట్టక తప్పదు. అసలిక్కడ వేరే రాష్ట్రం అంటే అర్థం ఏమిటి? నిబంధనల ప్రకారం.. ఏదైనా ప్రాంతంలో పరిమిత కాలానికి మించి ఉంటే.. నాన్ లోకల్ కాస్తా లోకల్ అయిపోతారు.

ఆ లెక్కన ఆంధ్రా ప్రాంతానికి చెందిన జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్ లో దశాబ్దాల తరబడి ఉంటున్నారు. ఆయన స్థిర నివాసం ఇక్కడే. ఆయన సొంత ప్రాంతానికి సెలవులకు కూడా వెళతారో వెళ్లరో. అలాంటప్పుడు ఆయన ప్రాంతీయత గురించి కేసీఆర్ ఎలా ప్రశ్నిస్తారు? ఆయన ఓటుహక్కు హైదరాబాద్ లో ఉన్నప్పడు ఆయన తెలంగాణ కాక ఆంధ్రావాడైపోతాడా? అన్నది క్వశ్చన్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలపై విమర్శలు చేయాలన్న కేసీఆర్ రూల్ లో నిజం ఉందని అనుకుందాం. అలాంటప్పుడు ఏపీ రాజధాని అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏమనాలి? తాను చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లోపాల్ని ఎత్తి చూపిస్తే సహించలేని కేసీఆర్.. తాను అమరావతి డెడ్ ఇన్ వెస్ట్ మెంట్ అని తాను ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుకే నేరుగా చెప్పినట్లు కేసీఆర్ చెప్పారు.

రూ.53వేల కోట్లతో అమరావతి కడుతుంటే.. అది సరైన నిర్ణయం కాదన్న తన మాటలు.. ఔరోకి షాదీమే అబ్దుల్లా బేగానా.. అన్నట్లు కాదా? అన్నది క్వశ్చన్. తనను ఎవరైనా తప్పు పట్టినంతనే వారి మూలాలు.. ప్రాంతీయత గుర్తుకు వచ్చే కేసీఆర్ కు.. తాను మాత్రం ఎవరినైనా ఏ మాట అయినా అనేయొచ్చా? అప్పుడు తాను చెప్పిన రూల్ తనకు వర్తించదా? అన్నది అసలు ప్రశ్న.