Begin typing your search above and press return to search.

జగన్‌ కు సైలెంట్‌ గా దెబ్బేస్తున్న కేసీఆర్?

By:  Tupaki Desk   |   18 May 2023 12:51 PM GMT
జగన్‌ కు సైలెంట్‌ గా దెబ్బేస్తున్న కేసీఆర్?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్‌ను భారీగా డ్యామేజ్ చేస్తున్నాయి. తెలంగాణను వజ్రపు తునకగా అభివర్ణించిన కేసీఆర్ ఏపీలో ఏమీ లేదంటూ ఎగతాళి చేయడం విమర్శలకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తన ప్రభుత్వం సాధించిన ఘనతలు చెప్పుకొంటున్న క్రమంలో ఏపీ గురించి మాట్లాడారు.

సొంత రాష్ట్రం సాధించుకున్న తరువాత తెలంగాణను వజ్రపు తునకగా మార్చానని గొప్పలు చెప్పుకొన్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటి? అనడంపై విమర్శలొస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వజ్రపు తునకగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉండడం వల్లే తెలంగాణ వజ్రపు తునక అయిందని.. అది లేకపోవడం వల్లే ఏపీ అధ్వాన స్థితికి చేరిందని అంటున్నారు.

అదే సమయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని.. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్‌ ను ఏపీలో కి విస్తరించే లక్ష్యంతో ఏపీని తక్కువ చేసి మాట్లాడుతూ.. అక్కడి వారికి కేసీఆర్ పాలనే గొప్ప అనేది ప్రొజెక్ట్ చేసుకునేలా ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు.

అయితే.. ఇది ప్రత్యక్షంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి దెబ్బే. కానీ... నిత్యం టీడీపీ, జనసేనలను విమర్శించే వైసీపీ నాయకులు కేసీఆర్ వ్యాఖ్యలకు ఏమాత్రం కౌంటర్ ఇవ్వలేదు.

నిజానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి రాష్ట్ర విభజన కూడా ఒక ప్రధాన కారణం. ప్రస్తుత జగన్ పాలనలో లోపాలతో పాటు విభజన వల్ల కలిగిన నష్టాల వల్లా రాష్ట్ర ప్రగతి కుంటుపడింది.

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఆదాయం అందించే వనరులు లేని రాష్ట్రంగా మారింది.. ముఖ్యంగా బంగారు బాతులాంటి ఐటీ రంగ కేంద్రం హైదరాబాద్ తెలంగాణపరమైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పై పదేళ్ల వరకు హక్కులున్నా ఏపీ వదులుకోవడంతో కేసీఆర్‌ కు ఎలాంటి చిక్కులులేకుండా అయింది.

ఇవన్నీ మరిచి కేసీఆర్ ఏపీని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుండడాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అయితే, ప్రజలకు కోపం వస్తున్నా జగన్‌ కు, ఆయన పార్టీ నేతల కు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు.