Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు థ్యాంక్స్ చెప్పిన అక్బ‌రుద్దీన్‌

By:  Tupaki Desk   |   18 Jan 2017 12:17 PM GMT
కేసీఆర్‌ కు థ్యాంక్స్ చెప్పిన అక్బ‌రుద్దీన్‌
X
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో మైనారిటీల సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అక్బ‌రుద్దీన్ కొనియాడారు. ఆంధ్రప్ర‌దేశ్‌ లో తెలంగాణ వక్ఫ్ భూములను ఆక్రమించగా... తెలంగాణలో ముస్లింల కోసం పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధిపై చర్చ చేపట్టినందుకు ధన్యావాదాలు తెలిపారు. నీట్ ఎగ్జామ్‌ ను ఉర్దూలో మీడియంలో కూడా నిర్వహించాలని అక్బరుద్దీన్ కోరారు.

కాగా అంత‌కుముందుకు కేసీఆర్ మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై అనుమానం అక్కర్లేదన్నారు. ప్రపంచంలో ఎక్కువ ముస్లిం జనాభా మ‌న‌ దేశంలో ఉందని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మంత్రి అయిన త‌ర్వాతి తొలి భేటీలో చెప్పానని గుర్తు చేశారు. తన వల్లే జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ ఏర్పాటైందని కేసీఆర్ అన్నారు. ముస్లింల పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయిందని జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక ఇచ్చిందని, అంతేకాకుండా మైనార్టీలపై వేసిన కమిటీలన్ని వారి ఆర్థిక పరిస్థితి దిగజారిందని చెప్పాయని కేసీఆర్ వివ‌రించారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీ కూడా నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తుందన్నారు. తమిళనాడు తరహాలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషీయల్ అధికారాలు ఇస్తామని ప్రకటించారు. ఫలక్‌నుమా డిగ్రీ - జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేస్తామని కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌ లో ఇస్లామిక్ సెంటర్‌ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉర్దూ మీడియం విద్యాసంస్థలకు ఉర్దూలో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. షాదీముబారక్ పథకంలో అవినీతిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. షాదీముబారక్ దరఖాస్తుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఎస్సీ - ఎస్టీ రైతులకు రాయితీ మాదిరిగా ముస్లిం రైతులకు రాయితీ కల్పిస్తామని చెప్పారు. సీం కేసీఆర్ వివరణ తర్వాత స్పీకర్ మధుసుధనాచారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/