Begin typing your search above and press return to search.

పెద్దదొరకు నచ్చారా..మీ పంట పండినట్టే!

By:  Tupaki Desk   |   7 Sept 2015 10:04 AM IST
పెద్దదొరకు నచ్చారా..మీ పంట పండినట్టే!
X
గులాబీ బాస్‌ ఈరోజున చైనా పర్యటనకు వెళుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయనకు మూడో విదేశీ పర్యటన ఇది. ఇదివరకు సింగపూర్‌, మలేషియాలలో ఆయన పర్యటించారు. దీని తర్వాత.. ఇంకా వరుసపెట్టి జపాన, తైవాన్‌ వంటి దేశాల్లో పర్యటించడానికి కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ చైనా పర్యటన సుదీర్ఘంగా 10 రోజుల పాటూ సాగనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటూ ఈ పర్యటనకు రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికార్లతో కూడిన అతిపెద్ద బృందం కూడా చైనాలో పదిరోజుల పాటూ పర్యటించబోతోంది. ఆ బృందాన్ని గమనిస్తే మాత్రం.. పెద్ద దొరకు నచ్చడం ఒక్కటే... విదేశీ టూరుకు అవకాశం సంపాదించుకోవడానికి ప్రాతిపదిక అని ఎవ్వరికైనా అర్థమవుతోంది.

నిజానికి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. అక్కడ ఆయన తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాల గురించి ప్రసంగించి.. హాజరయ్యే ప్రపంచవ్యాప్త పారిశ్రామిక వేత్తలకు ఒక భరోసా కల్పించాలి. ఇది ప్రాథమిక ఎజెండా. అయితే.. చైనాలోని పారిశ్రామికవేత్తలంరితో విందు సమావేశాలు ఏర్పాటుచేసుకుని, వారిని తెలంగాణలో పెట్టుబడి పెట్టేలా ఆహ్వానించడమూ.. చైనాలోని ప్రముఖ నగరాలను, పర్యాటక ప్రాంతాలను తిలకించడమూ.. అనే సుదీర్ఘ ఎజెండాను దానికి జత చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి కొందరుసీనియర్‌ అధికార్లు కొన్ని రోజులు ముందుగానే చైనాకు వెళ్లిపోయి.. రాబోయే వారందరికీ సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

సీఎం వెంట వెళ్లే బృందాన్ని చూస్తే.. అంతా ఆబ్లిగేషన్‌ లే ఎక్కువ అనిపిస్తుంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్‌ రెడ్డి అవసరం అనుకున్నప్పటికీ.. ఆయన వెంట స్పీకరు మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎంపీ కేశవరావు, డిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే బాలరాజు తదితరులంతా వెళుతున్నారు. సీఎంఓ నుంచి.. నలుగురు సీనియర్‌ అధికార్లు, ఇద్దరు పోలీసు ఉన్నతాధికార్లు కూడా వెళుతున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, టీఎస్‌ ఐఐసీ ఎండీ ఇప్పటికే చైనా లో ఉండి సమన్వయం పనులు చూస్తున్నారు. ఈ రాజకీయ బృందాన్నంతా గమనిస్తే.. అధ్యయనానికి వీరి అవసరం కంటె.. అయినవారందరికీ విదేశీయాత్ర ఆఫర్‌ ఇవ్వడమే కేసీఆర్‌ ఎజెండా అన్నట్లుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రమే కావొచ్చు గానీ.. ఇలా ఆశ్రితులు, తనకు నచ్చిన వారినంతా విదేశీ యాత్రలకు ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్లడం భావ్యం కాదని అంటున్నారు.