Begin typing your search above and press return to search.

అదే ప‌థ‌కాన్ని ఉప‌యోగించి, కేసీఆర్ ను ఓడించాల‌ని చూస్తోంది!

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:03 PM GMT
అదే ప‌థ‌కాన్ని ఉప‌యోగించి, కేసీఆర్ ను ఓడించాల‌ని చూస్తోంది!
X
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనేది సామెత. ఇప్పుడు హుజూరాబాద్ విష‌యంలో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమ‌లు చేయ‌నుందా? అంటే.. అవును అనే అభిప్రాయ‌మే వ్య‌క్త‌మ‌వుతోంది. ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. పొలిటిక‌ల్ హీట్ కు తెర‌తీశారు. కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే ఈ ప‌థ‌కాన్ని తెచ్చామ‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఆ ప‌థ‌క‌మే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని, గ‌ట్టెక్కించాల‌ని ఆశిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అదే ప‌థ‌కాన్ని ఉప‌యోగించి, కేసీఆర్ ను ఓడించాల‌ని చూస్తోంది బీజేపీ.

హుజూరాబాద్ లో రాజ‌కీయ వేడి ఎలా ఉందో అంద‌రూ చూస్తున్న‌దే. ఈ ఉప ఎన్నిక‌కు ఇంకా నోటిఫికేష‌న్ రానేలేదు. కానీ.. ఎన్నిక‌ల యుద్ధం మాత్రం అప్పుడే మొద‌లైంది. ఈ ఎన్నిక ఇటు ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించేది కావ‌డం.. అటు టీఆర్ఎస్ బ‌లాన్ని తేల్చ‌ది కావ‌డంతో ఎవ‌రికి వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని పోరాటం ఆరంభించారు. అయితే.. కేసీఆర్ అధికారాన్ని ఉప‌యోగించి ద‌ళిత బంధు వంటి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ.. ఆ వైపుగా న‌రుక్కొస్తున్నారు. ఇటు ఈట‌ల రాజేంద‌ర్ నేరుగా జ‌నంలోకి వెళ్తున్నారు. అయితే.. ఎవ‌రికి వారు విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికీ గెలుపు అంత ఈజీ కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ద‌ళిత బంధు ప‌థ‌కంతో ద‌ళిత జ‌నోద్ధ‌ర‌ణ‌కు పాటుప‌డుతున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌చారం చేసుకుంటున్నారు. అవ‌స‌ర‌మైతే ల‌క్ష కోట్లు అయినా స‌రే ఈ ప‌థ‌కానికి ఇస్తామ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈట‌లపై సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడి మొద‌లైంద‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. తాను త‌ప్పు చేశాన‌ని, త‌న‌ను క్ష‌మించాల‌ని కోరుతూ ఈట‌ల కేసీఆర్ కు రాసిన‌ట్టుగా ఒక లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అనంత‌రం ఆయ‌న బావ‌మ‌రిది ద‌ళితుల‌ను దూషించారంటూ ప్ర‌చారం మొద‌లైంది. వాట్సాప్ సంభాష‌ణ‌లు ఇవేనంటూ.. స్క్రీన్ షాట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కొంద‌రు పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈట‌ల దిష్టిబొమ్మ ద‌హ‌నాలు కూడా చేపట్టారు. దీనిపై ఈట‌ల స‌తీమ‌ణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌రి, అవి రాసింది ఎవ‌ర‌న్న‌ది మాత్రం తేల‌లేదు.

ఈ విధంగా ఈట‌ల రెండు వైపులా ఇబ్బందుల‌ను ఫేస్ చేస్తున్నారు. దీంతో.. ఈ ప‌రిస్థితికి చెక్ పెట్టేందుకు కాషాయ ద‌ళం కొత్త ఆలోచ‌న‌కు తెర‌తీసింద‌ని చెబుతున్నారు. ద‌ళిత బంధు అనేది కేవ‌లం ద‌ళితుల‌కు సంబంధించిన ప‌థ‌కం. హుజూరాబాద్ లో ఉన్న 45 వేల మంది ద‌ళితుల కోస‌మే దీన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అది కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేయ‌డం ఒకెత్త‌యితే.. అందులోనూ 100 కుటుంబాల‌కే తొలుత అందిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అంటే.. వంద మందికి అందించి.. మిగిలిన వాళ్లు ఓట్లు కొల్ల‌గొట్ట‌బోతున్నార‌ని, ఇది బోగ‌స్ వ్య‌వ‌హార‌మ‌ని ప్ర‌చారం చేసేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

ద‌ళిత బంధును స్వాగ‌తిస్తూనే.. అందులోనొ డొల్ల త‌నాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థం చేయించాల‌ని డిసైడ్ అయ్యింద‌ని చెబుతున్నారు. దీంతోపాటు మ‌రో అంశాన్ని కూడా ఎత్తుకోనుంద‌ట‌. కేవ‌లం ద‌ళితుల‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూర్చ‌డం కాద‌ని.. ఎస్టీల‌కు, బీసీల‌కు, మైనారిటీల‌కు సైతం ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టాల‌నే డిమాండ్ ను తెర‌పైకి తేనున్నారుట. అన్ని వ‌ర్గాల వారికీ ప‌ది ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ విధంగా.. కేసీఆర్ ను ఇరుకున పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఎలాగో ఈట‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బలం ఉండ‌డంతో.. ఈ వ్యూహాన్ని కూడా స‌క్సెస్ ఫుల్ అమ‌లు చేస్తే.. తిరుగులేని విజయం సాధించడం సాధ్య‌మ‌ని భావిస్తున్నార‌ట క‌మ‌ల‌నాథులు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.