Begin typing your search above and press return to search.

అసెంబ్లీ వ్యూహానికి భిన్నంగా కేసీఆర్ తాజా ప్లాన్!

By:  Tupaki Desk   |   3 March 2019 5:02 AM GMT
అసెంబ్లీ వ్యూహానికి భిన్నంగా కేసీఆర్ తాజా ప్లాన్!
X
ఊహించ‌ని విధంగా పావులు క‌ద‌ప‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. అందుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న‌దైన శైలిలో వ్యూహాన్ని వేయ‌ట‌మే కాదు.. వాటిని దిగ్విజ‌యంగా అమ‌లు చేయ‌టం.. తాను కోరుకున్న ఫ‌లితాల్ని తెచ్చుకోవ‌టం క‌నిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను య‌థాత‌ధంగా ఇద్ద‌రు త‌ప్పించి మిగిలిన వారిని ఎన్నిక‌ల బ‌రిలోకి దించ‌టం పెద్ద సాహ‌సంగా చెప్పాలి.

అధికార‌పార్టీ మీద ఉండే వ్య‌తిరేక‌త‌.. ఎమ్మెల్యేల ప‌నితీరుపై నియోజ‌క‌వ‌ర్గంలో ఉండే అసంతృప్తుల‌ను ప‌ట్టించుకోకుండా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం అంటే మాట‌లు కాదు. అంతేనా.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరిన గంట‌ల వ్య‌వ‌ధిలో కొద్దిమంది మిన‌హా మిగిలిన‌ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం ద్వారా సంచ‌ల‌నానికి తెర తీశారు. సిట్టింగుల మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న అభిప్రాయానికి భిన్నంగా.. త‌న‌ను చూసి ఓట‌ర్లుఓట్లు వేస్తార‌న్న విష‌యాన్ని చెప్పిన కేసీఆర్ మాట‌ల్ని చాలా మంది న‌మ్మ‌లేదు. కానీ.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాక మాత్రం.. అచ్చు గుద్దిన‌ట్లుగా.. కేసీఆర్ చెప్పిన‌ట్లే ఫ‌లితాలు ఉండ‌టం ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కుల్ని దిమ్మ తిరిగిపోయేలా చేసింది.

ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను జాగ్ర‌త్త‌గా గుర్తించ‌టం.. వారి మ‌న‌సుల్ని కేసీఆర్ అర్థంచేసుకున్నంత బాగా ఇటీవ‌ల కాలంలో ఏ అధినేత అర్థం చేసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది. ఒక ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత నెల‌ల త‌ర‌బ‌డి మంత్రుల్ని ఏర్పాటు చేయ‌కుండా ఉండ‌టం సాధ్యం కాదు. తీవ్ర‌మైన ఒత్తిడి.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతాయి. కానీ.. కేసీఆర్ విష‌యంలో అలాంటివేమీ చోటు చేసుకోక‌పోగా.. ఆయ‌న నిర్ణ‌యం కోసం ఎదురుచూసిన ప‌రిస్థితి.

చివ‌ర‌కు మీడియాలోనూ.. మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌క‌పోవ‌టంపై ఎవ‌రూ క‌లాన్ని విదిల్చి మ‌రీ రాసింది లేదు. అంత‌లా కంట్రోల్ చేసే స‌త్తా ఉన్న కేసీఆర్ కున్న మ‌రో గుణం.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాల్ని మార్చేసుకోవ‌టం. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అమ‌లు చేసిన ముంద‌స్తు అభ్య‌ర్థుల ప్ర‌కట‌న‌కు భిన్నంగా తాజా లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.

విప‌క్షాలు చ‌తికిల‌ప‌డిపోయి.. మ‌ళ్లీ లేవ‌లేని రీతిలో ఉన్న‌వేళ‌.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీ అభ్య‌ర్థుల విష‌యంలో తాపీగా ప్ర‌క‌ట‌న చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ముంద‌స్తుగా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన విధానానికి భిన్నంగా ఈసారి వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న డిసైడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తొలుత అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన బాట‌లోనే ప‌య‌నించాల‌ని భావించినా.. త‌ర్వాత ఆయ‌న త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలోని 17 లోక్ స‌భ స్థానాల్లో 16 స్థానాల్లో విజ‌యం సాధించాల‌న్న ల‌క్ష్యాన్ని కేసీఆర్ పెట్టుకున్నారు. త‌న‌కు అత్యంత ఆఫ్తుడైన మిత్రుడు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ బ‌రిలోకి దిగే హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం నుంచి త‌న పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌కూడ‌ద‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న టార్గెట్ 16 ఎంపీల‌న్న నినాదాన్నే త‌ర‌చూ వినిపిస్తున్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థులుగా దాదాపుగా సిట్టింగుల‌కే మ‌ళ్లీ పార్టీ టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఎంపీలుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఎమ్మెల్యేలుగా గెలిచినా మ‌ల్లారెడ్డి.. బాల్క సుమ‌న్ స్థానాల‌తో పాటు.. ఒక‌ట్రెండు నియోజ‌క‌వ‌ర్గాలు త‌ప్పించి మిగిలిన అన్ని చోట్ల సిట్టింగుల‌కే అవ‌కాశం ఉంది. ఈ ఎన్నిక‌లు సైతం అభ్య‌ర్థుల ఆధారంగా కాకుండా.. త‌న‌ను చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేయాల‌న్న నినాదాన్నే వినిపించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. కేంద్రం మెడ‌లు వంచాలంటే 16 సీట్లు ఉండాల్సిందేన‌న్న మాట మంత్రంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి తాను కోరుకున్న‌ట్లుగా తుది ఫ‌లితం ఉండాల‌న్న యోచ‌లో కేసీఆర్ ఉన్నారు. మ‌రి.. ఆయ‌న మాట‌ను తెలంగాణ ఓట‌ర్లు ఏ మేర‌కు మ‌న్నిస్తారో చూడాలి.