Begin typing your search above and press return to search.

ఈ జిల్లా అంటే బాబుకు న‌చ్చ‌దు..జవాబు ఇచ్చాకే అడుగుపెట్టాలి

By:  Tupaki Desk   |   19 Nov 2018 1:39 PM GMT
ఈ జిల్లా అంటే బాబుకు న‌చ్చ‌దు..జవాబు ఇచ్చాకే అడుగుపెట్టాలి
X
గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టారు. వ‌రుస‌గా బ‌హిరంగ స‌భ‌ల ద్వారా ఆయ‌న ప్ర‌చారం హీట్‌ ను పెంచారు. సెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం - పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం - పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబును గులాబీ ద‌ళ‌ప‌తి టార్గెట్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని అయితే, చంద్ర‌బాబు దీనికి అడ్డుప‌డుతున్నార‌ని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ``తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వ‌లే ఖ‌మ్మం జిల్లాను తయారు చేయబోతున్నాం. పాలేరు బాటలోనే ఖమ్మం జిల్లా మొత్తం పచ్చబడాలి అంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిండు. దీనిపై ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచించాలి. ప్రచారానికి వచ్చే ముందు బాబు సమాధానం చెప్పాలి. లేదంటే ప్రజలు చంద్రబాబును అడ్డుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో టీడీపీ తరపున అభ్యర్థులను నిలబెట్టారో నిలదీయాలి. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించే వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వొద్దు. మనకు నీళ్లు రాకుండా అడ్డుపడే వాళ్లకు ఓట్లు ఎలా వేస్తారు? సీతారామ ప్రాజెక్టు మీద రాసిన లేఖను విరమించుకున్నాకే ప్రచారానికి చంద్రబాబు రావాలని కేసీఆర్ సూచించారు.

భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుదేన‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ``తుమ్మల పనిగురించి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు . పాలేరు పచ్చబడడానికి తుమ్మలనే కారణం. మన దగ్గర ఏ ప్రాజెక్టుకు కూడా కొమ్రం భీం, గొప్ప నాయకుల పేర్లు పెట్టలేదు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అని పేరు పెట్టారు. కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ జలదోపిడీ చేసిన వైఎస్ రాజశేఖర్ పోలవరం, దుమ్ముగూడెం టేల్ ద్వారా ఆంధ్రాకు నీళ్లు తీసుకుని పోయేందుకు గిరిజనుల నోట్లో మట్టికొట్టారు. మన వేలితో మన కన్నే పొడుచుకుందామా? మన ఉరితాడును మనమే బిగించుకుందామా? ఏడు మండలాలు అక్రమంగా తీసుకోకముందు 180 కిలోమీటర్లు గోదావరి పారేది. 180 కిలోమీటర్లు పారే గోదావరి ఉన్న తర్వాత ఈ జిల్లాలో కరువు ఎట్లా ఉంటది. మన ఖర్మ కాకపోతే. ఇన్ని కిలోమీటర్లు పారే గోదావరి జిల్లాలో కరువు ఉంటదా? కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇవాళ సిగ్గు లేకుండా మళ్లీ పోటీకి వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎందుకు ఖమ్మంకు నీళ్లు ఇవ్వలేదు? మనం ప్రజలం కాదా? ఖమ్మంకు గోదావరిలో హక్కు లేదా? అందుకే టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిల‌వాలి. ఖ‌మ్మ‌ను స‌స్య‌శ్యామం చేసుకోవాలి`` అని కేసీఆర్ వివ‌రించారు.

ఈ సంద‌ర్బంగా జాతీయ రాజ‌కీయాల గురించి కేసీఆర్ వివ‌రించారు. జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ``దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ అవసరం ఉంది. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం. భారతదేశం కూడా ఇవాళ దిక్కు, దిక్సూచి లేకుండా ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమైనాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని నరేంద్రమోదీకి అధికారమిస్తే.. ఆయన కూడా చతికిలబడి పోయిండు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ఈ రెండు పార్టీలు దేశానికి పనికిరావు. అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారు. ఈ దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది. దీని కోసం తాను కొంత ప్రయత్నం చేశాను. కానీ తనకు చిల్లర మాటలు రావు. ఢిల్లీలో చక్రం తిప్పుతా.. తోక తిప్పుతా అని చెప్పడం రాదు. ఢిల్లీని అదుపు చేసేటటువంటి రాజకీయం మాత్రం ఈ ఎన్నికల తర్వాత గ్యారెంటీగా ఉంటది. అందుకు ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదం కావాలలి` అని సీఎం కేసీఆర్ అన్నారు.