Begin typing your search above and press return to search.

ఆ నిర్ణయంతో జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Jan 2021 2:30 PM GMT
ఆ నిర్ణయంతో జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన కేసీఆర్
X
ఎప్పుడూ జగన్ ముందుగా పథకాలు ప్రవేశపెట్టడం.. పక్కనున్న సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. జగన్ ప్రకటించిన ‘అమ్మఒడి’.. స్కూళ్ల విషయంలో నాడు -నేడు కార్యక్రమాలు తెలంగాణలోనూ అమలు చేయాలని ఒత్తిడి వచ్చింది.నవరత్నాలు అమలు చేయాలని డిమాండ్ వచ్చింది. అయితే కేసీఆర్ మాత్రం దీన్ని లైట్ తీసుకున్నాడు.

అయితే తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ సీఎం జగన్ కు మంటపుట్టించేలా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటికీ ఈ కోటా అమలవుతోంది.

అయితే రాష్ట్రాలు మాత్రం ఈ కోటాను అమలు చేయడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోటా ఇప్పటికీ అమలు కావడం లేదు. కానీ తాజాగా కేసీఆర్ సర్కార్ మోడీ బాటలో నడిచాడు. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కీలకనిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్రం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయించాలని కోరుతూ గవర్నర్ ను పలుమార్లు కోరారు. ఈ సమయంలో తెలంగాణలో కేసీఆర్ అమలు చేయడంతో ఏపీ సీఎం జగన్ ను ఇరుకునపెట్టినట్టైంది.

రెండేళ్ల క్రితమే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించినా ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా లేదు. దీనికి కొన్ని చిక్కులు ఉండడమే కారణంగా తెలుస్తోంది. కొత్త రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. రిజర్వేషన్లు అందుకుంటున్న సామాజికవర్గాల్లో అనుమానాలు, భయాలు ఉన్నాయి. అన్నింటికంటే మించి వీరంతా వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వారే.. దీంతో కొత్త రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే వారి నుంచి వ్యతిరేకత తప్పదని జగన్ అంచనా వేసుకుంటున్నారు.

సీఎం జగన్ కు ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇప్పటివరకు గవర్నర్ ఫిర్యాదులకు పరిమితమైన బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.