Begin typing your search above and press return to search.

శాసనసభ రద్దు కానుందా..!?

By:  Tupaki Desk   |   1 Sep 2018 5:00 AM GMT
శాసనసభ రద్దు కానుందా..!?
X
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం నాడు హైదరాబాాద్ శివారులోని కొంగర కలాన్‌లో జరుగనున్న బహిరంగ సభకు ముందు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. ఈ భేటీలోనే మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకుని శాసనసభను రద్దు చేసే ఆలోచనను వారితో పంచుకోవాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కొంగర కలాన్‌ లో సభ ప్రారంభం అవుతుంది. సరిగ్గా రెండు గంటల ముందు అంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. ఈ సమావేశంలో శాసనసభ రద్దుతో పాటు సాయంత్రం సభలో తాను ఏం చెప్పదలచుకున్నది మంత్రివర్గ సహచరులకు వివరించాలన్నది కె.చంద్రశేఖర రావు ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించడం, ఇంత వరకూ ప్రభుత్వ ఏం చేస్తుందో వివరించడంతో పాటు ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో కూడా ఈ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వివరించనున్నారు. ఆదివారం నాడు సభలో శాసనసభ రద్దుపై నిర్ణయాన్ని ప్రకటించి సభకు వచ్చిన వారి నుంచి కూడా ఆమోదం పొందాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంగా కనిపిస్తోంది.

కంగర కలాన్ సభలో జరుగుతున్న సభ ద్వారా ప్రతిపక్షాలకు కూడా సమాధానం చెప్పాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటికే జాతీయ స్ధాయిలో భారతీయ జనతా పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి చేతులు కలిపిందని ప్రజల్లో ఓ భావన ఉందనేది స్పష్టమైంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇదే విషయంపై ఆందోళనగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పన్నిన ఈ ద్విముఖ వ్యూహంతో అటు జాతీయ స్ధాయిలోనూ - ఇటు రాష్ట్ర స్ధాయిలోనూ కూడా భారతీయ జనతా పార్టీని ఒంటరిని చేసినట్లుగా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా బహిరంగ సభ ద్వారా తమ బలం - బలగం చూపించాలన్నది ముఖ్యమంత్రి ఎత్తుగడ. ఈ సభ ద్వారా కాంగ్రెస్ నాయకులను మానసికంగా ఇబ్బందులు పాలు చేయవచ్చునన్నది ఆయన ప్లాన్. ఒకేసారి అటు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంతో పాటు ఇటు ప్రజల మనసు గెలుచుకోవడం కూడా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భివిస్తున్నారు.