Begin typing your search above and press return to search.

ఇలాంటి వరాలిస్తే కేసీఆర్ ను వద్దంటారా?

By:  Tupaki Desk   |   3 Jan 2016 5:27 AM GMT
ఇలాంటి వరాలిస్తే కేసీఆర్ ను వద్దంటారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లోపలి ‘వరాల దేవుడు’ నిద్ర లేచాడు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. అడిగినోడికి.. అడగనోడికి అన్న తేడా లేకుండా వరాలు ఇచ్చేశారు. ఇందుకోసం సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం సాగించి.. హోల్ సేల్ గా వరాలు ఇచ్చేశారు. గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. గ్రేటర్ కోటపై గులాబీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

గత కొద్దికాలంగా క్యాబినెట్ సమావేశం జరగని నేపథ్యంలో భారీ ఎజెండాను చర్చకు ఉంచారు. రెండు సెషన్లలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో శనివారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని స్టార్ట్ చేశారు. అది చివరకు రాత్రి 10.30 గంటల వరకూ సాగింది. మధ్యలో భోజన విరామ సమయం కాసేపు ఇచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించారు. 11 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మొత్తం 60కు పైగా అంశాల్ని చర్చించారు. ఇంత సుదీర్ఘంగా మంత్రిమండలి సమావేశం సాగటం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. తాజాగా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైన వాటిని చూస్తే..

= ఒప్పందం ఉద్యోగులందరినీ జనవరి నెలాఖరు లోపు క్రమబద్ధీకరిస్తాం. పోస్టుల భర్తీలో రిజర్వేషన్ పరంగా ఇబ్బందులు ఎదురైతే ఆ పోస్టుల మేరకు అదనంగా బ్యాక్ లాగ్ పోస్ట్ ల భర్తీ చేస్తారు.

= ఒప్పందం ఉద్యోగులు 18 వేల మంది వరకు ఉన్నారు. వీరందరి క్రమబద్ధీకరణ జరుగుతుంది.

= మూడు కేటగిరీలుగా ఉన్న పొరుగుసేవల ఉద్యోగుల జీతాల్ని ఈ నెల నుంచి పెంచారు. రూ.6700 ఉన్న జీతం రూ.12వేలకు.. రూ.8400 ఉన్న జీతం రూ.15వేలకు.. రూ.10,900 ఉన్న జీతం రూ.17వేలకు పెంచటం.

= తెలంగాణ రాష్ట్రంలో 18వేల సెలూన్లు ఉన్నాయి. వీటి నుంచి వాణిజ్య కేటగిరిలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడే సెలూన్లకు ఇకపై డొమెస్టిక్ కేటగిరిలో విద్యుత్తు బిల్లులు వేస్తారు. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.144కోట్ల భారం పడే అవకాశం ఉంది.

= జీహెచ్ ఎంసీ పరిధిలో రూ.1200 వార్షిక ఇంటి పన్ను కట్టే వారు ఇకపై రూ.101 కడితే సరిపోతుంది.

= హ్యాకర్లకు ఒక స్థలాన్ని కేటాయించి.. వారిపై వేధింపులు లేకుండా చేస్తాం.

= ట్రాఫిక్ పోలీసులు కాలుష్య బారిన పడుతున్నారు. వారికి బేసిక్ శాలరీలో 30 శాతాన్ని అదనంగా కాలుష్య భత్యంగా చెల్లింపు.

= 1989 నుంచి గ్రేటర్ లోని నీటి బకాయిల మాఫీ.

= 15,628 టీచర్ పోస్టుల మంజూరు.

= మైనార్టీ శాఖకు సంబంధించి ప్రతి జిల్లాకు 80 పోస్టుల మంజూరు.

= నీటిపారుదల శాఖలో 108 పోస్టులు.. ఎంజీఎంలో 147 పోస్టులు.. పాలమూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో 462 పోస్టుల మంజూరు.

= గ్రేటర్ పరిధిలో పేదలకు నిర్మించే తొమ్మిది అంతస్తుల భవనాలకు లిఫ్టులుతప్పనిసరి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంపు.

= 40 టీఎంసీల సామర్థ్యంతో రామోజీ ఫిలిం సిటీ పక్కన.. శామీర్ పేట పక్కన ఒక రిజర్వాయర్ కడతాం.

= అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసే వారికి 1.5శాతం ప్రోత్సహాకాన్ని నీరుపారుదల శాఖలో ఇస్తాం. మిషన్ కాకతీయ.. భగీరథకు దీన్ని అమలు చేస్తాం.

= రియల్ ఎస్టేట్ రంగానికి రాయితీలు ఇస్తాం. 22 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నాం. ఆదివారం వాటిని ప్రకటిస్తాం.

= కొత్తగూడంలో 115 ఎకరాలు పోలీసు బెటాలియన్ కు కేటాయిస్తాం.

= ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజు వారికి ప్యాకేజీ ఒకేసారి ఇచ్చి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దించి రావాలి.