Begin typing your search above and press return to search.

ఆ అప్ర‌క‌టిత కోడ్ ను బ్రేక్ చేసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   28 Sep 2018 10:27 AM GMT
ఆ అప్ర‌క‌టిత కోడ్ ను బ్రేక్ చేసిన కేసీఆర్!
X
రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు - మిత్రులు ఉండ‌ర‌నేది ఒక నానుడి. అధికారం శాశ్వ‌తం కాద‌ని....ఈ రోజు ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పిన తాము...రేపు ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సి వ‌స్తుంద‌ని దాదాపుగా ప్ర‌తి రాజ‌కీయ‌నాయకుడికి తెలుసు. అందుకే, తెర‌పైకి రాజ‌కీయ వైరం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ.... తెర వెనుక రాజ‌కీయ నాయ‌కులంతా ఎంతోకొంత స్నేహాన్ని కొన‌సాగిస్తుంటారు. ఉడ‌తా భ‌క్తిగా....వేరే పార్టీల‌లో ఉన్న నేత‌ల‌కు అడ‌పాద‌డ‌పా సాయం చేస్తుంటారు. తాము రేపు అధికారంలో లేన‌పుడు....త‌మ‌ను వారు ఆదుకుంటార‌నే ఆశ‌తో ఇదంతా చేస్తుంటారు. ఇలా ఈ స‌హాయ‌స‌హ‌కారాలు ఇచ్చిపుచ్చుకోవ‌డం....చాలా కామ‌న్. ఈ రకంగా తెలుగు రాజ‌కీయాల్లో ఓ అజ్ఞాత స‌హాయ‌ స‌హ‌కార కోడ్ కొన‌సాగుతోంది. కానీ, తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్...అంద‌రిక‌న్నా భిన్నంగా ఆ కోడ్ ను బ్రేక్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

బెల్లంకొండ సురేష్-బాల‌కృష్ణ ల కాల్పుల ఎపిసోడ్ అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి....రాజ‌కీయ వైరాన్ని ప‌క్క‌నబెట్టి మ‌రీ....అప్ప‌టి మాజీ సీఎం చంద్ర‌బాబు బామ్మ‌ర్ది బాల‌కృష్ణ‌ను ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేశారని వ‌దంతులు వ‌చ్చాయి. ఒక్క వైఎస్ మాత్రమే కాదు...దాదాపుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజ‌కీయ నాయ‌కులు ఈ ఇచ్చి పుచ్చుకునే కోడ్ ను ఫాలో అవుతుంటారు. ఎక్క‌డో బ‌ద్ధ శ‌త్రువులు....వ్య‌క్తిగ‌త వైరాలు ఉన్న కేసులు ఈ కోడ్ కు మిన‌హాయింపు. కానీ, కేసీఆర్ మాత్రం....అస‌లు త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులే ఉండ‌కూడ‌దని భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొన్న జ‌గ్గారెడ్డి అరెస్టు....నిన్న రేవంత్ పై ఐటీ దాడులు....ఇవ‌న్నీ చూస్తుంటే...కేసీఆర్....ఆ కోడ్ ను బ్రేక్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. రేవంత్ రెడ్డి, జ‌గ్గారెడ్డిల‌తో పాటు మ‌రికొంద‌రిని టార్గెట్ చేసిన కేసీఆర్.....వారితో భ‌విష్య‌త్తులో కూడా రాజ‌కీయ వైరం కొన‌సాగించాల‌నే రీతిలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, ఇపుడు అధికారం కేసీఆర్ చేతిలో ఉంది కాబ‌ట్టి చ‌ల్తా. కానీ, రేపు ఏదో ఒక‌రోజు...ఓడలు బండ్లు...బండ్లు ఓడ‌లు..త‌ర‌హాలో ..కేసీఆర్ వ‌ల్ల‌ ఇబ్బంది ప‌డ్డ నేత‌లు అధికారంలోకి వ‌స్తే....వారి ప్ర‌తీకార చ‌ర్య‌ల‌ను అధికారంలో లేని కేసీఆర్ ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.