Begin typing your search above and press return to search.

తూగో జిల్లాలో కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

By:  Tupaki Desk   |   18 Feb 2016 4:02 AM GMT
తూగో జిల్లాలో కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు
X
టీఆర్ఎస్ పార్టీని తెలుగు రాష్ట్ర స‌మితిగా మారుస్తామ‌ని గులాబీ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఏ సంద‌ర్భంలో చెప్పారో తెలియ‌దు కానీ...ఆ మాట‌లు నిజ‌మ‌య్యే సూచ‌న‌లు ఒక్కొక్క‌టిగా క‌నిపిస్తున్నాయి. కొద్దికాలం క్రితం ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగులు కేసీఆర్ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసి శుభాకాంక్ష‌లు తెలుప‌గా....సంక్రాంతి సంద‌ర్భంగా కేసీఆర్ త‌ర‌ఫున గోదావ‌రి జిల్లాల్లో ప‌లువురు పండుగ ఆనందాన్ని పంచుకుంటూ ఫ్లెక్సీలు క‌ట్టారు. తాజాగా కోస్తాంధ్ర‌లో కీల‌క ప్రాంత‌మైన తూర్పుగోదావరి జిల్లా కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌ వెళ్ళి స్థిరపడ్డ వారు "తెలంగాణా స్టేట్‌ సీమాంధ్ర యునైటెడ్‌ ఫ్రంట్‌" పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్రంట్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ పట్టణాలైన కాకినాడ - రాజమండ్రి - అమలాపురం - మండపేట తదితర ప్రాంతాల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అనాధాశ్రమాల్లో వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాలల్లో పిల్లలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంచారు.

తెలంగాణా స్టేట్‌ సీమాంధ్ర యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌ సింగినీడి సీతారామ్‌ అమలాపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. లూయీ అంధుల హాస్టల్‌ లో కేక్‌ కట్‌ చేసి అంధ బాలలకు ఆయ‌న‌ పళ్ళు పంచారు. ఈ సందర్భంగా సింగినీడి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర రథ సారధి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని వివరించారు. తెలుగు రాష్ర్టాల సంక్షేమం కోరుతున్న వ్య‌క్తి కేసీఆర్ అని కొనియాడారు. అందుకే తాము జ‌న్మ‌దిన వేడుకల‌ను నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌క‌టించారు.