Begin typing your search above and press return to search.

కేసీఆర్ మా హీరో..ఏపీలో కేసీఆర్ బ‌ర్త్‌ డే వేడుక‌లు

By:  Tupaki Desk   |   17 Feb 2018 5:33 PM GMT
కేసీఆర్ మా హీరో..ఏపీలో కేసీఆర్ బ‌ర్త్‌ డే వేడుక‌లు
X
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున్నే ఉన్న‌ట్లుగా మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. ఆయ‌న జన్మదిన వేడుకలు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌ లో ఘనంగా జరిగాయి. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే ఇవాళ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు.

తెనాలిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమాని ఖాదీర్.. పట్టణంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ విధంగా కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని ఖాదీర్ చాటుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ దృష్టిలో గొప్ప హీరో అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసి.. తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రా నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.