Begin typing your search above and press return to search.
ఈ నరసింహనాయుడు....కేసీఆర్ ఆత్మ
By: Tupaki Desk | 11 Oct 2017 6:03 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత భిన్నమైన వ్యక్తిత్వంతో నడుచుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు నచ్చని వారిని దూరం పెట్టేసే గులాబీ దళపతి అదే సమయంలో తన అనుకుంటే ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఈ జాబితాలో మిత్రులు కనుక ఉండి ఉంటే....ఆ ట్రీటే వేరుగా ఉంటుంది. అలా సీఎం కేసీఆర్ నుంచి గౌరవం పొందుతున్న మిత్రుడి గురించి ఓ ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఇటు టీఆర్ ఎస్ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో సాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గవర్నర్ ను కలుస్తున్న సమయంలో దీంతో పాటుగా మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా ఆయన వెంట ఓ వ్యక్తి ఉండటం గమనించే ఉంటారు. టీఆర్ ఎస్ పార్టీ నేతలకు - తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా సుపరిచితం కానీ వ్యక్తికి గవర్నర్ వద్దకు తీసుకువెళ్లేంత ప్రాధాన్యం దక్కింది అంటే సహజంగానే `ఆయన ఎవరు?` అనే ఆసక్తి కలుగుతుంది కదా? అలాంటి ఆసక్తితోనే ఆయన గురించి రాజకీయవర్గాలు వివరాలు తెలుసుకోగా ఆయన కేసీఆర్ కు అత్యంత ఆప్తుడని తేలింది. ఇంతకీ సదరు కేసీఆర్ దోస్తు ఎవరంటే....ఆయన పేరు నరసింహనాయుడు. విజయవాడకు చెందిన వ్యక్తి. కేసీఆర్ కు నరసింహనాయుడుకు మిత్రుత్వం ఇప్పటిది కాదట. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఉండేది. కేసీఆర్ టీడీపీ నేతగా ఉన్నప్పుడు నర్సింహనాయుడు ఆ పార్టీలోని కీలక విభాగమైన మానవ వనరుల అభివృద్ధి (హెచ్ ఆర్ డీ)లో ఉండేవారు. ఆయనకు అన్ని విభాగాల్లో పట్టు ఉండేది. కేసీఆర్ కు కావాల్సిన ప్రతీ సమాచారాన్నీ నర్సింహనాయుడు అందించేవారు. అయితే టీఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యయాన్ని చేపట్టిన తర్వాత కేసీఆర్ నర్సింహనాయుడుతో మాట్లాడేందుకు సమయం దొరకలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేసీఆర్ నర్సింహనాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు.
విజయవాడ నుంచి వచ్చిన మిత్రుడు కాబట్టి నగరంలో బస సమస్య సహజంగానే ఉంటుందని భావించి బయట ఎక్కడా ఉండకుండా ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌లోనే ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యం మామూలుగా లేదంటున్నారు. ప్రగతిభవన్ లోనే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. సమీక్షలు లేనప్పుడు ఆయనతో ముఖ్యమంత్రి మాటా మంతీ అంటున్నారు. కుటుంబసభ్యుల కంటే ఈ దోస్తుకే ఎక్కువ విలువ ఇస్తున్నారని.... చివరికి ఆయన చెప్పిన ఘడియలను కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నారని అంటున్నారు. ఆయనకు చిన్నపాటి జలుబు చేసినా..జ్వరం వచ్చినా..ముఖ్యమంత్రి విలవిల్లాడిపోతున్నారని చెప్తున్నారు. అయితే ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే దానికి సమాధానం వస్తోంది. తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందున, ఆయన సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని పార్టీకి సంబంధించిన కొంతమందికి కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. భాష మీద పట్టు ఉన్నదని, ఆయన సలహాలు తీసుకుని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని సీఎం సన్నిహితులు తెలిపారు.
మరోవైపు తమ ఇద్దరి మిత్రుత్వాన్ని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ కు మాత్రమే పరిమితం చేయడం లేదని అంటున్నారు. ఇటీవల తన మిత్రున్నీ గవర్నర్ వద్దకు తీసుకెళ్లి మరీ ప్రత్యేకంగా కేసీఆర్ పరిచయం చేశారు. దీంతో పాటుగా ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు వివాహ వేడుకకు కూడా నర్సింహనాయుడిని వెంట పెట్టుకుని కేసీఆర్ తీసుకెళ్లడం గమనార్హం. సహజంగానే...ఈ ఇద్దరి స్నేహాన్ని టీఆర్‌ఎస్‌పార్టీ నేతలు, ప్రగతిభవన్‌లో ఉన్నవారే జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.