Begin typing your search above and press return to search.

కవర్ చేసి కేసీఆర్ పరువు కాపాడారు

By:  Tupaki Desk   |   23 Aug 2016 9:30 AM GMT
కవర్ చేసి కేసీఆర్ పరువు కాపాడారు
X
నాయకుడు రక్షకుడిలా ఉంటే ఆయన్ను ఫాలో అయ్యే వారికి ఎంత హాయిగా ఉంటుందన్న విషయం తెలంగాణ రాష్ట్ర మంత్రుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మంత్రులందరికి రక్షణ కవచంలా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని వారు చేసే తప్పులు బయటకు కనిపించకుండా పోతున్నాయి. సోషల్ మీడియా ఉంది కాబట్టి కొన్ని విషయాలైనా బయటకు వస్తున్నాయే కానీ.. అదే లేకుండా ఏ విషయమూ బయటకు రాని పరిస్థితి.

నిన్నటికి నిన్న జరిగిన సంగతే చూద్దాం. రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకం సాధించిందంటే అందులో ఆమె కృషి ఎంత ఉందో.. అంతే కృషి ఆమె కోచ్ గోపీచంద్ దన్న విషయాన్ని ఏ ఒక్కరూ కాదనరు. కానీ.. అలాంటి కోచ్ ను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా బిత్తరపోయే పరిస్థితి. సింధుకు స్వర్ణం తేవాలంటే మంచి కోచ్ అవసరమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏవో కొన్ని ఛానల్స్ తప్పించి.. మిగిలిన మీడియా సంస్థలు పెద్దగా ఫోకస్ చేయలేదు.

నిజానికి ఇలాంటి మాటలే వేరే ముఖ్యమంత్రి హయాంలో జరిగి ఉంటే.. మీడియా ఓ చూపు చూసేది. కానీ.. అలీ వ్యాఖ్యల్ని చాలా బ్యాలెన్స్ గా ఇచ్చారే కానీ.. ఎక్కడా ఆ వ్యాఖ్యలపై ‘వ్యాఖ్యానాల్ని’ ఇచ్చేందుకు ప్రముఖ మీడియా సంస్థలేవీ ఇష్టపడలేదు. ఎందుకిలా అంటే.. అది కేసీఆర్ సమర్థత అనే చెప్పాలి. చిన్న విషయాలకు అంత లొల్లి చేస్తారేంటని కేసీఆర్ నోటి నుంచి ఏ క్షణంలో అయినా మాట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అంతవరకూ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లాలన్నట్లుగా మీడియా సంస్థలు సంయమనం పాటించాయే కానీ దూకుడు ప్రదర్శించలేదు.

నిజానికి మహ్మద్ అలీ మాటలు వివాదాస్పదమయ్యాయి కానీ మాట్లాడటం కానీ.. సింధుకు సన్మానం చేసిన సమయంలో మాట్లాడిన తెలంగాణ మంత్రుల్లో ఒక్క కేటీఆర్ తప్పించి మిగిలిన వారెవరూ సందర్భానికి తగినట్లుగా మాట్లాడిన వైనం కనిపించదు. ఒక అపురూప ఘట్టానికి సంబందించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. ఆ స్థాయిలో కాకున్నా కనీసం అందరి ఆమోదం పొందే స్థాయిలో మంత్రులు (కేటీఆర్ మినహా) మాట్లాడలేకపోవటం చూస్తే ఆశ్చర్యమనిపించక మానదు. సరిగా మాట్లాడలేని మంత్రులతో ముఖ్యమంత్రి సమర్థంగా.. ఎలాంటి వివాదాలు లేకుండా బండి లాగిస్తున్న తీరు చూస్తే.. కేసీఆర్ ను మెచ్చుకోకుండా ఉండలేం. అందుకేనేమో.. నిన్నటి సన్మాన సభ తర్వాత కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడిన కొందరు అధికారపక్ష నేతలు.. ‘‘సీఎం సాబ్ కవర్ చేస్తున్నారు కాబట్టి సరిపోతోంది. లేకుంటే ఏమైపోయేదో..?’’ అంటూ తమ మాటల్లో అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేయటం గమనార్హం.