Begin typing your search above and press return to search.
బాబును కేసీఆర్ 'ఈజ్' గానే కొట్టేశారండోయ్!
By: Tupaki Desk | 1 Nov 2017 5:13 AM GMTకొత్త రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనితీరులో అన్ని రాష్ట్రాల సీఎంల కంటే కూడా చాలా మెరుగైన పనితీరును కనబరుస్తున్నారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో సమకూరిన వనరులను ఆసరా చేసుకుని కేసీఆర్ నెరపుతున్న మంత్రాంగం నిజంగానే అద్భుతమనే చెప్పాలి. పనితీరులో కేసీఆర్ కొట్టిన దెబ్బకు పొరుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజంగానే అల్లంత దూరంలో పడిపోయారు. అసలు కేసీఆర్ కు చంద్రబాబు ఏ కోశానా కూడా సరిసాటి అన్న భావన ఇప్పుడు కనిపించడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... ఏమాత్రం జంకూబొంకూ లేకుండా చాలా ధైర్యంగా క్షణాల్లోనే తన వైఖరికి స్పష్టం చేస్తున్న కేసీఆర్ స్పీడుతో అసలు చంద్రబాబు ఏమాత్రం పోటీ ఇవ్వలేని స్థితిలో పడిపోయారని చెప్పాలి.
అయినా వీరిద్దరి మధ్య మనం ఎప్పుడూ పోలికలు వేసుకుంటుంటాం గానీ... ఈ సారి ఏ విషయంలో ఈ పోటీ వచ్చిందన్న విషయానికి వస్తే... ఇరు రాష్ట్రాల మధ్య అప్పుడెప్పుడో పతాక స్థాయికి చేరిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోరులో ఇప్పుడు తెలంగాణ... నవ్యాంధ్రకు అందనంత ఎత్తుకు ఎదిగిందనే చెప్పాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. అలా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలకు అవసరమైన వనరులన్నీ సమకూర్చాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆయా రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్న రాయితీలు - పారిశ్రామికవేత్తలకు పరుస్తున్న ఎర్ర తివాచీల ఆధారంగానే పరిశ్రమలు వస్తాయన్న విషయం ఏ ఒక్కరు కూడా కాదనలేని సత్యమే. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఒకదానిని మించి మరొకటి అభివృద్ధి చెందాలని ఏపీ - తెలంగాణ పోటీ పడ్డ విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు కూడా సరికొత్త పారిశ్రామిక విధానాన్ని రాసుకున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు విధానాన్ని అమల్లోకి తెచ్చేశాయి. తమ తమ నూతన పారిశ్రామిక విధానాలతో పరిశ్రమలు తమ రాష్ట్రాలకు వెల్లువెత్తుతాయని ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ ప్రభుత్వాలు కూడా భావించాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక అనుకూలతకు గీటురాయిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను చెప్పుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు - కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) జారీ చేసే ఈ ర్యాంకుల్లో అగ్రస్థానం తమదంటే... కాదు తమదేనని తెలంగాణ - ఏపీలు పోట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఐపీపీకి తాము సమర్పించిన దరఖాస్తును ఏపీ కాపీ కొట్టేసిందని తెలంగాణ సర్కారు గతంలో సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయాన్ని అంత ఈజీగా పరిగణించలేమని చెప్పిన కేసీఆర్ సర్కారు.. బాబు సర్కారుపై కేసులు కూడా పెడతామని హెచ్చరించింది.
అయితే నాడు కేసుల వరకు వెళ్లని ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఆ తర్వాత అంతా ఈ విషయాన్ని మరిచిపోయారు కూడా. అయితే తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి తాజా ర్యాంకులు నిన్న విడుదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా... చంద్రబాబు పాలనలోని నవ్యాంధ్ర మాత్రం ఎక్కడో 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారిశ్రామిక అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని జారీ అయిన ఈ ర్యాంకులకు సంబంధించి మార్కుల్లో తెలంగాణ 59.95 శాతం మార్కులు సాధించేసి అగ్రస్థానంలో సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. అయితే తమ రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూతలు మరే రాష్ట్రంలో లేవని డాంబికాలు పలికిన బాబు సర్కారు... కేవలం 12.90 మార్కులను మాత్రమే సాధించి నవ్యాంధ్రను 15వ స్థానంలో నిలబెట్టింది.