Begin typing your search above and press return to search.

మరో‘శారీ’ కేసీఆర్ గ్యారంటీనా?

By:  Tupaki Desk   |   9 May 2017 9:50 AM GMT
మరో‘శారీ’ కేసీఆర్ గ్యారంటీనా?
X
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కోట్లాది ఓట్లు కొల్లగొట్టేందుకు పెద్ద ప్లానే వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులను సెంటిమెంటుతో కొట్టేందుకు ఆయన సకల ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ముఖ్యంగా తెలంగాణలో ప్రధానమైన పండుగ, మహిళలు ఎంతో ఇష్టపడే బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు ప్రదానం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్క దెబ్బకు మూడు పిట్టలను కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలందరికీ చీరలు పంచాలన్నది కేసీఆర్ యోచన. అంటే... 86 లక్షల చీరలు అవసరమవుతాయని అంచనా. ఈ చీరల పంపిణీతో ఆ మహిళలు, వారి కుటుంబాలు ఫిదా కావడం ఖాయం. ఇక్కడ మరో విశేషమేంటంటే పంచబోయేవన్నీ చేనేత చీరలు. అవన్నీ తయారు కానుంది తెలంగాణలోనే. అంటే తెలంగాణ నేతన్నలకు భారీగా పని దొరకబోతోంది.

మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నియోజకవర్గమైన చేనేత ఖిల్లా సిరిసిల్లకే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో మొన్న జిల్లాల ఏర్పాటు సందర్భంగా కేటీఆర్ పై వచ్చిన వ్యతిరేకత అక్కడ పోగొట్టబోతున్నారన్నమాట.

కాగా బతుకమ్మ పండుగకు ఇవ్వబోయే 86 లక్షల చీరలకు రూ.160 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇదే సమయంలో కేసీఆర్ కిట్లలో భాగంగానూ మరో 5 లక్షల చీరలు ఇస్తారట. ఇందుకోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇవన్నీ కలిపి మొత్తం 175 కోట్లతో చీరలు పంచిపెడితే ఆ ఎఫెక్టు మామూలుగా ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కేసీఆర్ తాజా వ్యూహం తెలిసిన విపక్ష నేతలు దీన్నెలా ఎదుర్కొనాలా అని తలలు పట్టుకుంటున్నారట.