Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో ఈ కోణం కాస్త ఎక్కువే

By:  Tupaki Desk   |   13 Nov 2015 12:12 PM GMT
కేసీఆర్ లో ఈ కోణం కాస్త ఎక్కువే
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ఆయనలో ఈ కోణాన్ని ఎవరూ పెద్దగా గమనించరు. కానీ.. ఆయనలో ఈ కోణం కాస్త ఎక్కువే. తన మూలాల్ని మరవని కేసీఆర్.. తన ఊరి వారి దగ్గర నుంచి.. తన దగ్గర పని చేసే వారి వరకూ అందరిని ఆయన గుర్తించటమే కాదు.. తన హోదాను మరిచి వారిని అప్యాయంగా పలుకరిస్తుంటారు.

సీఎంవో కార్యాలయంలో పని చేసే వారిలో ఎక్కువ మంది పేర్లతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుస్తుంటారని చెబుతారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. తన ఊరి వాళ్లు కనిపిస్తే.. కారు ఆపి మరీ వారితో మాట్లాడి.. వారి కష్టనష్టాల గురించి వాకబు చేసి.. వారి సమస్యల్ని తీర్చే ధోరణి కేసీఆర్ కు కాస్త ఎక్కువే. తాజాగా ఆయన తనలోని ‘కోణాన్ని’ ప్రదర్శించారు. తన దగ్గర డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కుమార్తె పెళ్లికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు.

ముఖ్యమంత్రిగా తన స్థాయి ప్రదర్శించే గుణం ఉన్న కేసీఆర్.. కొన్ని విషయాల్ని మాత్రం అసలు అలాంటి వైఖరిని ప్రదర్శించరు. తన దగ్గర ఎంతోకాలంగా డ్రైవర్ గా పని చేస్తున్న గరిపల్లె బాలయ్య కుమార్తె రమ్యకృష్ణ పెళ్లికి స్వయంగా హాజరయ్యారు. పెళ్లి ముహుర్తానికి పది నిమిషాల ముందే వెళ్లిన కేసీఆర్.. పెళ్లి కార్యక్రమం ముగిసే వరకూ ఉండి.. వధూవరులను స్వయంగా ఆశ్వీరదించి వచ్చారు.

ఎన్నో ఏళ్లుగా తన దగ్గర పని చేస్తున్న వారి ఇంట జరిగే శుభకార్యాల్ని గుర్తుంచుకొని వెళ్లే యజమాలు ఎంతమంది? అలాంటిది.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. తన డ్రైవర్ కూతురు పెళ్లికి వెళ్లి.. తన పెద్ద మనసును మరోసారి చాటారు కేసీఆర్. ముఖ్యమంత్రి స్వయంగా పెళ్లి మండపానికి రావటంతో.. పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయి.. ఆనందంతో ఉబ్బితబ్బుబ్బిపోయారు. అసమాన్యుడి సామాన్యుడి ఇంట జరిగే శుభకార్యానికి వస్తే ఆ మాత్రం విస్మయం మామూలేగా.