Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే - వారిద్ద‌రే హాట్ టాపిక్‌!

By:  Tupaki Desk   |   19 Jan 2019 8:40 AM GMT
వాలెంటైన్స్ డే - వారిద్ద‌రే హాట్ టాపిక్‌!
X
ప్రేమికులకు అత్యంత ఇష్ట‌మైన రోజు వాలెంటైన్స్ డే. ఒక‌రిపై ఒక‌రికి ఉన్న అపార‌మైన ప్రేమ‌ను వ్య‌క్త‌ ప‌రుచుకోవ‌డానికి దాన్ని వారు ఉప‌యోగించుకుంటుంటారు. అందుకే ఆ రోజు కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంటారు. వ‌చ్చే వాలెంటైన్స్ డే మాత్రం కేవ‌లం ప్రేమ ప‌క్షుల్లోనే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత - వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ తో తెలంగాణ ముఖ్య‌మంత్రి - గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఆ రోజు భేటీ కానుండ‌ట‌మే అందుకు కార‌ణం.

అమ‌రావ‌తిలో వ‌చ్చే నెల 14న జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశం ఉంది. ఈ వేడుక‌కు కేసీఆర్ హాజ‌రు కానున్నారు. అదే నెల 21న తాను జ‌రిపించ‌నున్న యాగానికి జ‌గ‌న్ ను ఆహ్వానించ‌నున్నారు. అయితే - గృహ‌ప్ర‌వేశం - యాగం అనేవి కేవ‌లం ఫార్మాలిటీలు. కేసీఆర్ - జ‌గ‌న్ క‌లిసినప్పుడు ఏం మాట్లాడుకుంటార‌న్న‌దే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగించుకొని ఊపు మీద ఉన్న జ‌గ‌న్ తో కేసీఆర్ ఈ నెల 15 - 16వ తేదీల్లో ఫోన్ లో మాట్లాడారు. త‌న కుమారుడు కేటీఆర్ ను జ‌గ‌న్ ద‌గ్గ‌రికి పంపించారు కూడా. కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు గాను కేసీఆర్ ప్ర‌తిపాదిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా జ‌గ‌న్ ను కేటీఆర్ కోరారు. వైసీపీ అధినేత అందుకు సానుకూలంగా స్పందించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ దోస్తీని మ‌రింత బ‌ల‌ప‌ర్చుకునేందుకు గాను కేసీఆర్ అమ‌రావ‌తికి వెళ్తున్నారు. తెలంగాణ‌ - ఏపీల్లో మెజారిటీ సీట్లు సాధించ‌డం ద్వారా టీఆర్ ఎస్‌ - వైసీపీ క‌లిసి కేంద్రంలో ఎలా ప్ర‌భావం చూప‌గ‌ల‌వో జ‌గ‌న్ కు కేసీఆర్ వివ‌రించే అవ‌కాశ‌ముంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు కోరే సూచ‌న‌లు కూడా క‌నిపిస్తున్నాయి. ఈ భేటీతో కేసీఆర్ - జ‌గ‌న్ మ‌ధ్య బంధం బాగా బ‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప‌రిణామం ఏపీ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి మింగుడు ప‌డ‌నిదేన‌ని వారు సూచిస్తున్నారు.