టైం చూసి ఈటలను దెబ్బకొట్టిన కేసీయార్

Mon May 03 2021 12:00:01 GMT+0530 (IST)

kcr as health minister

టైం చూసి దెబ్బకొట్టడంలో కేసీయార్ ను మించినోరు లేరు.  ముందు ఈటల రాజేందర్ నుండి శాఖలు తొలగించటం మరుసటిరోజే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయటం తెలంగాణాలో సంచలనంగా మారింది. చాలాకాలంగా కేసీయార్-రాజేందర్ మద్య సంబంధాలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలుస్తునే ఉంది. ఒకసారి కేసీయార్ తో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఈటల మంత్రివర్గంలో ఉండేది అనుమానమే అనే ప్రచారం జరుగుతునే ఉంది. దానికి తగ్గట్లే వరుసగా రెండు రోజుల్లో డెవలప్మెంట్లు జరిగిపోయాయి.ఎప్పటినుండో రాజేందర్ మంత్రివర్గం నుండి పక్కకు వచ్చేస్తారని అందరు అనుకుంటున్నదే. కాకపోతే బర్తరఫ్ అయిన టైమింగే కేసీయార్ వ్యూహ చతురతను తెలియజేస్తోంది. పోయిన నెలలలోనే నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగింది. సరిగ్గా ఫలితం వచ్చిన ఆదివారం నాడే రాజేందర్ ను బర్తరఫ్ చేయాలని కేసీయార్ డిసైడ్ చేశారు. ఎన్నిక జరగక ముందు కాకుండా కౌంటింగ్ జరిగిన రోజు ఎందుకు బర్తరఫ్ చేశారు ?

ఎందుకంటే సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలవటం కేసీయార్ కు చాలా ప్రిస్టేజ్ గా మారింది. అప్పటికే దుబ్బాకలో ఓడిపోవటం గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో చాలా డివిజన్లలో ఓడిపోవటంతో కేసీయార్ ఇమేజి బాగా డ్యామేజయ్యింది. ఆ నేపధ్యంలోనే సాగర్ ఉపఎన్నిక వచ్చింది. ఉపఎన్నిక సమయంలో కానీ పోలింగుకు ముందుకానీ రాజేందర్ పై యాక్షన్ తీసుకునుంటే టీఆర్ఎస్ గెలుపు కష్టమైపోయేదనటంలో సందేహం లేదు.

ఎందుకంటే తెలంగాణాలోని బలమైన బీసీ సామాజికవర్గం నేతల్లో రాజేందర్ కూడా ఒకరు. ఉపఎన్నిక పోలింగుకు ముందే రాజేందర్ పై యాక్షన్ తీసుకుంటే దానిప్రభావం కచ్చితంగా టీఆర్ఎస్ పై పడే ప్రమాధం ఉందని కేసీయార్ అంచనా వేశారు. దాంతో ఈటలపై చర్యలకు కేసీయార్ వెనకాడారు. సాగర్ నియోజకవర్గంలో బీసీల ఓట్లు చాలా ఎక్కువున్నాయి. అసలే తన ఇమేజి డ్యామేజయిన సందర్భంలో టీఆర్ఎస్ సాగర్ ఎన్నికలో ఓడిపోతే తనకు ఇబ్బందులు తప్పవని కేసీయార్ అనుకున్నారట.

అందుకనే ఉపఎన్నిక పోలింగ్ అయిపోయిన తర్వాత పావులు కదిపారు. సరిగ్గా కౌంటింగ్ కు ఒకరోజు ముందు కౌంటింగ్ రోజున రాజేందర్ పై చకచక వేటు వేసేశారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్టుతో మీడియా యావత్తు బిజీగా ఉన్న సమయంలోనే రాజేందర్ బర్తరఫ్ అంశానికి సరైన ప్రాధాన్యత కూడా దక్కకుండా చేశారు. ఇక్కడే కేసీయార్ టైమింగ్ అర్ధమైపోతోంది.