Begin typing your search above and press return to search.

మునుగోడులో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. లెంకలపల్లి ప్రత్యేకమే..

By:  Tupaki Desk   |   7 Oct 2022 5:03 AM GMT
మునుగోడులో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. లెంకలపల్లి ప్రత్యేకమే..
X
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అధికార టీఆర్ఎస్ తప్ప.. కాంగ్రెస్, బీజేపీ, ప్రజా శాంతి పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఒకప్పటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చేయనుండగా, బీజేపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా యుద్ధ నౌక గద్దర్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. కాగా, జాతీయ రాజకీయాలకు వెళ్తూ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ప్రకటించనున్నట్లు ఎక్కువగా కథనాలు వస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే అయిన కూసుకుంట్ల వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో మోహరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇలా మొత్తమ్మీద 90 మందిపైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మునుగోడును చుట్టేయనున్నారు.

అందుకుతగినట్లుగానే పార్టీ అంతా సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్లో ఒకరైన, గజ్వేల్ ఎమ్మెల్యే అయిన సీఎం కేసీఆర్ ఏ గ్రామానికి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీనికి సమాధానంగా ఆయన క్లిష్టమైన గ్రామాన్నే ఎంచుకున్నారు. ఎంతైనా సవాళ్లకు ఎదురీదే కేసీఆర్ అంటే కేసీఆరే కదా..? అందుకే 80 మంది ప్రజాప్రతినిధులకు 80 గ్రామాల చొప్పున తలా ఒకటి అప్పగించిన ఆయన తాను మాత్రం తనదైన ముద్ర ఉండేలా గ్రామాన్ని ఎంచుకున్నారు.

సర్పంచ్ ను చేర్చుకుని

మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం ఈ ఉప ఎన్నికలో ప్రత్యేకంగా నిలవనుంది. సీఎం కేసీఆర్ తన బాధ్యతల్లో భాగంగా ఈ గ్రామానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఇక లెంకలపల్లి విలేజ్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఈ గ్రామ జనాభా 2,085. మొత్తం ఓటర్లు 1,857. అయితే ఈ గ్రామం పూర్తిగా కాంగ్రెస్ కు పట్టున్నది. హార్డ్ కోర్ హస్తం పార్టీ అభిమానులు ఇక్కడున్నారు. వామపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి.

రాజగోపాల్ కు అత్యధిక ఓట్లు ఇక్కడే..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి అత్యధిక ఓట్లు లెంకలపల్లి నుంచే వచ్చాయి. గ్రామంలోని అత్యధిక ఓటర్లు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. కాగా, లెంకపల్లి సర్పంచ్ గా ప్రస్తుతం పాకా సతీష్ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన సతీష్ ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. 500 మందితో కలిసి ఆయన కారెక్కారు. కాంగ్రెస్ కు గత 15 ఏళ్లుగా లెంకలపల్లి అండగా ఉంటోంది. పంచాయతీ ఎన్నికల్లో సతీష్ గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేలా ప్రయత్నాలు సాగించి.. నెల రోజుల మంతనాల అనంతరం సతీష్ ను లాగేసుకున్నారు.

మర్రిగూడ ఇన్ చార్జీగా హరీశ్ రావు

మర్రిగూడ మండలానికి ఆర్థిక-ఆరోగ్య శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్ రావు ఇన్చార్జిగా ఉంటారు. లెంకలపల్లి ఈ మండలంలోనే ఉంది. ఉప ఎన్నికల గెలుపు సారథి అయిన హరీశ్.. మండలం మొత్తంతో పాటు లెంకలపల్లిపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా కేసీఆర్ స్థాయికి తగినట్లుగా ఓట్లు సాధించే వీలుంటుంది. మరోవైపు దసరా నాడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటన అనంతరం లెంకలపల్లిలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.