Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కేసీఆర్ పోరాటం!

By:  Tupaki Desk   |   11 July 2018 4:38 AM GMT
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కేసీఆర్ పోరాటం!
X
ఉమ్మ‌డి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఆయ‌న స‌వాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. సుప్రీంకోర్టులో స‌వాలు చేయ‌టం ద్వారా.. త‌మ‌కు అనుకూల‌మైన తీర్పు వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. పంచాయితీ ఎన్నిక‌ల్లో ఎస్సీ.. ఎస్టీ..బీసీల‌కు క‌ల్పించే రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాట‌కూడ‌దంటూ ఉమ్మ‌డి హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో స‌వాలు చేయ‌నుంది.

ఈ అంశంపై అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు చేసి సుప్రీంలో పిటిష‌న్ వేయ‌టానికి బుధ‌వారం మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం కావాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. ఉమ్మ‌డి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తో పాటు సంబంధిత అధికారుల్ని త‌న ఇంటికి పిలిచిన కేసీఆర్‌.. తెలంగాణ‌లోని పంచాయితీరాజ్ సంస్థ‌ల్లో 61 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు చేయాల్సిన అవ‌స‌రాన్ని కోర్టుకు అర్థ‌మ‌య్య‌లా చెప్పే వాద‌న‌ల్ని సిద్ధం చేయాల‌న్న సూచ‌న చేశారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని దెబ్బ తీసేలా కాంగ్రెస్ నేత‌లు స్వ‌ప్నారెడ్డి చేత హైకోర్టులో పిటిష‌న్ వేయించి.. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు ఆ పార్టీ గండి కొట్టిన‌ట్లుగా త‌ప్పు ప‌ట్టారు. బీసీల‌కు34 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌టానికి తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఇందుకోసం చేయాల్సిన న్యాయ‌పోరాటాన్ని చేస్తామ‌న్నారు.

పంచాయితీ రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు క్రీడా కోటా అంశంపైనా సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇంజ‌నీరింగ్‌.. వైద్య విద్య లాంటి కోర్సులో క్రీడా కోటా కింద ఈ ఏడాది ఆడ్మిష‌న్లు ఇవ్వొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రీడా కోటాలో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది. క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి అవ‌కాశం ఇవ్వాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న అని.. అధికారుల కార‌ణంగా పేరు విన‌ని క్రీడ‌ల్ని జాబితాలో చేర్చ‌టం ద్వారా తాజా ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. ఈ నిర్ణ‌యం పైనా సుప్రీంలో పోరాటం చేయాల‌న్నారు. మొత్తానికి హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీంలో పోరాడ‌నున్న కేసీఆర్ కు ఎలాంటి అనుభ‌వం ఎదుర‌వుతుందో చూడాలి.