Begin typing your search above and press return to search.

డోంట్ కేర్ అంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Nov 2017 10:48 PM IST
డోంట్ కేర్ అంటున్న కేసీఆర్
X
ఆయనతో మోనార్క్ ను మించిన మొండి పట్టుదలతోనూ వ్యవహరిస్తారు. తాను తలచుకుంటే.. ఇక ఎవరు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోరు. ఆయనే ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్న సచివాలయం బాగున్నది కదా.. కొత్తది ఎందుకు అని ప్రశ్నించినందుకు.. ఒక్క సచివాలయం ఏమిటి?... ఈ అసెంబ్లీ.. రవీంద్రభారతి కూడా చెత్తగా ఉన్నాయి అంటూ ఆయన విరుచుకుపడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాలనకు అనువుగా కొత్త భవంతులు నిర్మించేందుకు తీసకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదనే భావన ముఖ్యమంత్రి కెసిఆర్ లో వ్యక్తమౌతోంది. ప్రతిపక్షాలు నానా యాగీ చేసినాసరే ఆ భవంతులు కట్టితీరుతామంటున్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్షాలు కొత్త సెక్రటేరియట్ - అసెంబ్లీ భవన ప్రతిపాదన పై వ్యతిరేక భావనను ప్రకటించాయి. ప్రతిపక్షాల అభిప్రాయాలను విన్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రస్తాయిలో స్పందించారు.

హైదరాబాద్ లో ఉన్న సచివాలయం చెత్తగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీకూడా బాగాలేదన్నారు. ఏ ఒక్క బిల్డింగ్ కూ అనుమతిలేదన్న విషయాన్ని బయటపెట్టారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంత చెత్త సచివాలయం ఎక్కడాలేదన్నారు కెసిఆర్. అసెంబ్లీ భవనం అనువుగా లేనందువల్లే కెసిఆర్ కొత్త భవన నిర్మాణ ప్రతిపాదన చేశామంటున్నారు గతంలో పాలకులు ఎక్కడ బడితే బిల్డింగ్ లు కట్టారట. హైదరాబాద్ లో మొత్తం 19 స్టేడియాలు ఉన్నాయి.. అవన్నీ వృధా గా ఉన్నాయి... బై సన్ పోలో గ్రౌండ్ క్రీడా గ్రౌండ్ కాదు... దేశంలో 54 కంటోన్మెంట్ లు ఉన్నాయి... కంటోన్మెంట్ భూమిని బదలాయించలేదన్న విషయాలను కెసిఆర్ సభకు వివరించారు.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువైన వసతి లేదని విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త శాసనసభ ఆవరణతో పాటు, అన్ని విభాగాలకు సంబంధించి వినూత్న తరహాలో మంచి భవంతి - కళ నిర్మించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి తీరుతామంటున్నారాయన. కొత్తరాష్ట్రంలో కెసిఆర్ మార్కు పాలనలో కట్టిన భవంతులు చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్ధేశంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఉన్నతాశయంతో తలపెట్టిన ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తి లేదని కెసిఆర్ సమాధానమిచ్చారు. అప్పుల్లో ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా... కొత్త కట్టడాలతో రూ.500 కోట్ల రూపాయలు వ్యయంచేయడం ఎంతమేరకు అవసరం ఉందోనన్న అంశాన్ని ప్రతిపక్షాలు సూచనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. క్రీడా మైదానం లో సచివాలయం కట్టడమేంటని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సక్రమంగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం అవసరమేంటని నిలదీశారు. రాష్ట్రంలో రైతులు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. రైతుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వానికి ... కొత్త భవంతులు అవసరమేంటన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎవ్వరూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు..

ప్రతిపక్షాల విమర్శలకు ఇన్ని రకాల బుకాయింపు జవాబులు చెప్పడం కంటె.. తన ముద్ర ఉండే కొత్త భనవాల నిర్మాణం లక్ష్యం అని ఆయన సూటిగా చెప్పిఉన్నా బాగుండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.