Begin typing your search above and press return to search.

కొత్త గుబులు: కేసీఆర్ ప్రకటించే ఆ ‘15’ మందితో మరెంత రచ్చనో?

By:  Tupaki Desk   |   16 Aug 2021 3:49 AM GMT
కొత్త గుబులు: కేసీఆర్ ప్రకటించే ఆ ‘15’ మందితో మరెంత రచ్చనో?
X
ఏదైనా కొత్త పథకాన్ని ప్రకటిస్తున్నప్పుడు.. దాని లబ్థిదారుల ప్రకటన ఉత్సాహంగా ఉండటమే కాదు.. అధికార పార్టీ నేతలంతా మాంచి జోష్ లో ఉంటారు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదకు వచ్చినట్లుగా చెప్పే తెలంగాణ దళితబంధు పథకాన్ని.. ఈ రోజు (సోమవారం) హుజూరాబాద్ లో జరిగే కార్యక్రమంలో కేసీఆర్ ప్రకటించనున్నారు.

అంతేకాదు.. లబ్థిదారులుగా తొలుత పదిహేను మందిని డిసైడ్ చేశారు. ఇప్పుడీ జాబితాలో ఉండే వారెవరు? అన్నది ప్రశ్నగా మారింది. ఈ జాబితాలోని పేర్లను అధికారులు ఇప్పటివరకు గోప్యంగానే ఉంచారు. కేసీఆర్ సమయంలో బయటకు రానున్న ఈ లబ్థిదారులతో కొత్త రచ్చ ఖాయమని గులాబీ పార్టీకి చెందిన నేతలే కొందరు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.10 లక్షల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేసే ఈ కార్యక్రమంలో లబ్థిదారులుగా ఎంపికైన వారికి పండుగే. కాకుంటే.. ఈ మొత్తాన్ని ఆశించిన వేలాది మందికి నిరాశకు గురి కావటమే కాదు.. తమ పేర్లు ఎప్పుడు వస్తాయన్న ఆశ ఖాయమంటున్నారు.

ఇప్పటికే లబ్థిదారుల ఎంపికలో తప్పులు చోటు చేసుకున్నాయని.. ఈ పథకం గురించి మాట్లాడేందుకు నియోజకవర్గం నుంచి ప్రగతిభవన్ కు తీసుకెళ్లిన వారి పేర్లు లేవంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. లబ్థిదారులుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణతో నియోజకవర్గం రగిలిపోయింది. పేర్ల ఎంపిక ఇలా సాగిందంట అన్న ఊహాగానానికి అంత రచ్చ జరిగినప్పుడు.. ఏకంగా పేర్లు ప్రకటిస్తున్న వేళలో.. పరిస్థితి మరెలా తయారవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎంపిక చేసిన పదిహేను మంది ఎవరన్న విషయానికి సమాధానం చెప్పేందుకుసిద్ధంగా లేకపోవటం గమనార్హం.

వాస్తవానికి శుక్రవారానికి లబ్థిదారుల జాబితా సిద్ధం కాలేదని.. కాకుంటే అయినట్లుగా లీకులు ఎలా ప్రచారంలోకి వచ్చాయన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్ కు ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. ఎలాంటి పేర్లు బయటకు రాలేదని చెప్పినా ప్రభుత్వ వర్గాలు మాత్రం సీరియస్ గా ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీఎం చేతుల మీదుగా ఎంపికైనట్లు పత్రాలు తీసుకునే పదిహేను మంది ఎవరన్న విషయాన్ని శనివారం ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రూ.10లక్షల మొత్తం కేసీఆర్ సర్కారుకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.