Begin typing your search above and press return to search.

బ్రాహ్మణుల కడుపు నిండే మాట చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:54 AM GMT
బ్రాహ్మణుల కడుపు నిండే మాట చెప్పిన కేసీఆర్
X
భారత్ మీద పట్టు బిగించేందుకు విభజించి పాలించన్న సూత్రాన్ని అప్పుడెప్పుడో బ్రిటీషోడు చాలా తెలివిగా అమలు చేసిన వ్యూహం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం కూడా ఇంచుమించు ఇదే తీరులో ఉంటుందని ఆయన్ను విమర్శించే వర్గం తరచూ ఆరోపిస్తుంది. అయితే.. వారి వాదనను అధికారపక్షానికి చెందిన వారు తప్పుబ‌డుతుంటారు. అందరినీ కలుపుకు వెళుతుంటే.. తప్పులు ఎత్తి చూపిస్తున్నారంటూ మండిపడుతుంటారు. ఈ ఇద్దరి వాదనల్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని చూసినప్పుడు మాత్రం.. ఏ వర్గానికి తగ్గట్లు ఆ వర్గానికి వేర్వేరు వరాలు ఇస్తూ.. అందరి మనసుల్ని దోచుకుంటూ.. కేసీఆర్‌ బలపడుతున్న వైనం కనిపిస్తుంది.

తాను ఎంత మాత్రం కొందరివాడిని కానని.. అందరివాడినన్న భావనను అందరిలోనూ కలిగించే విలక్షణ తత్వం కేసీఆర్ సొంతం. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యూహం ఎంతలా ఉంటుందనటానికి తాజాగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ సమీక్షే నిదర్శనంగా చెప్పాలి. అత్యున్నత స్థానాల్లో పని చేసే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులతో పాటు.. ఒక కులానికి సంబందించిన అత్యంత ప్రముఖుల్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటమే కాదు.. వారందరి మనసుల్ని దోచుకునేలా నిర్ణయాలు తీసుకోవటం.. వారు చేసే సూచనల్ని విధిగా పాటిస్తామన్న మాటతో పాటు.. ఆ వర్గంతో తనకు.. తన కుటుంబానికి మద్యనున్న సంబంధాన్ని మాటల మధ్యలో చెప్పటం ద్వారా.. తనకున్న అభిమానమంతా ఇప్పటికిప్పుడు వచ్చింది ఎంతమాత్రం కాదని.. దశాబ్దాలుగా సాగుతుందన్న భావన కలిగేలా చేయటంలో కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైన వ్యవహారంగా చెప్పాలి.

కీలక పదవుల్ని చేపట్టి.. రిటైర్ అయిన పలువురు ప్రముఖుల్ని ‘కుల’ ప్రతినిధులుగా చేసి.. వారి నోటి నుంచి తమ కులానికి చెందిన వారి సంక్షేమానికి ఏం చేయాలో చెప్పించుకోగలిగిన సత్తా కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలో జ‌రిగిన బ్రాహ్మణుల సంక్షేమంలో పాల్గొన్న ప్రముఖుల జాబితాలో శాంపిల్ గా కొన్ని పేర్లు చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది.

మాజీ డీజీపీ అరవిందరావు.. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు లాంటి ప్రముఖులతో పాటు పలువురు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిని కూర్చొబెట్టి.. ఆ వర్గానికి ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలన్న విషయంపై సమక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా.. కేసీఆర్ ఇచ్చిన వరాలు సైతం భారీగా ఉండటం గమనార్హం. గతంలో కొన్ని వర్గాల వారికి ఎకరం.. ఐదు ఎకరాల్లో భవన నిర్మాణాలకు ఓకే చెప్పిన కేసీఆర్.. తాజాగా పది నుంచి పన్నెండు ఎకరాల్లో భారీస్థాయిలోబ్రాహ్మణ సదనం ఏర్పాటు చేస్తామని.. అందులో తెలంగాణతో పాటు దేశ విదేశాలకు చెందిన పీఠాధిపతులు.. పండితులు.. బ్రాహ్మణులు అందరికి వసతి కల్పించనున్నట్లుగా ప్రకటించారు.

అర్చకులకు మంచి జీతాలతో పాటు.. బడ్జెట్ లోకేటాయించిన రూ.100 కోట్లను బ్రాహ్మణ ట్రస్టు ద్వారా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. 1985లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి సిద్ధిపేటలో బ్రాహ్మణ సామాజిక భవనాన్ని నిర్మించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనే తాను ఎదిగినట్లుగా చెప్పుకున్నకేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత బ్రాహ్మణుల సంక్షేమం మీద ఫోకస్ చేయటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే.. తమ జీతభత్యాలు పెంచాలంటూ తెలంగాణ వ్యాప్తంగా అర్చకస్వాములు ఆందోళనలు చేయటం.. కొన్ని రోజులు తమ విధులకు దూరంగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ సానుకూలంగా స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా.. సమయానికి తగ్గట్లుగా మనసు దోచుకునేలా మాట్లాడటం కేసీఆర్ కు మాత్రమే సొంతమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/