Begin typing your search above and press return to search.

సర్కారీ ఉద్యోగులకు కేసీఆర్ తాజా వరం?

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:19 AM GMT
సర్కారీ ఉద్యోగులకు కేసీఆర్ తాజా వరం?
X
వరాల దేవుడిగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకున్న పేరుకు తగ్గట్లే తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ఇప్పటివరకూ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ.. మరే ముఖ్యమంత్రి తీసుకోని రీతిలో ఆయ‌న‌ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించని ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు చెబుతున్నట్లుగా కానీ జరిగితే.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అజన్మాంతం కేసీఆర్ ను దైవంగా కొలవటం ఖాయమని చెబుతున్నారు.

ఇంతలా ఖుషీ చేసే కేసీఆర్ నిర్ణయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఏటా ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తారు. వావ్ అనుకునేరు. కాస్త ఆగాలి. ఎందుకంటే.. ఈ వరాల జాబితాలో మొదటి వరం మాత్రమే ఇది. దీనికి కొనసాగింపుగా మరిన్ని వరాలు ఉన్నాయి. అవేమంటే.. వారికి అవసరమైన మందుల్ని జీవితాంతం ఉచితంగా అందచేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హెల్త్ కార్డు స్కీంలో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో ఈ తాజా వరాన్ని ప్రకటిస్తారని.. ఒక్కసారి కానీ ఈ వరం కానీ అధికారికంగా వెల్లడైతే.. ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అంతు ఉండదని చెప్పొచ్చు. ఇవాల్టి రోజు వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవటంతో పాటు.. చాలామంది నిత్యం మందుల్ని వాడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడతుంది. ఇక.. వృద్ధులు.. పెద్ద వయస్కులకు ఇలా మందులు వాడటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. దీంతో.. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లుగా చెబుతున్న ఈ నిర్ణయంతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టటమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి భారీ భరోసా దక్కినట్లుగా అవుతుందని చెప్పొచ్చు. కేసీఆర్ తాజా నిర్ణయం రాజకీయంగానూ కీలకమైనదిగా చెబుతున్నారు.

ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయి. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అనునిత్యం ఉపయోగపడేలా హెల్త్ కార్డులు మారనున్నాయి. అదే సమయంలో క్రమపద్ధతిలో ప్రతి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించటం ద్వారా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా మొదట్లోనే గుర్తించే అవకాశంతో పాటు.. వైద్య సేవలకు సంబంధించిన ఖర్చు ఉద్యోగులకు తగ్గుతుందని చెప్పొచ్చు. తాను తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. వైద్య పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజా స్కీంతో తెలంగాణ ఉద్యోగులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. మిగిలిన రాష్ట్రాల ఉద్యోగులు సైతం ఇదే తీరులో తమకు కూడా వసతి కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/