Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ క‌డుపు నిండుగా కేసీఆర్ వ‌రం

By:  Tupaki Desk   |   29 Sep 2017 6:25 AM GMT
ఎన్నిక‌ల వేళ క‌డుపు నిండుగా కేసీఆర్ వ‌రం
X
మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. వ‌రమిస్తే.. వ‌రం పొందినోడు సైతం అవాక్కు అయ్యేలా వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్యం. ఉద్యోగుల జీతాల పెంపుపై ఏదైనా డిమాండ్లు తెర మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు వెళ్లే వ‌ర‌కూ ప్ర‌భుత్వం చూస్తుండిపోతుంది. ఆ త‌ర్వాత గీసిగీసి మ‌రీ బేరం ఆడ‌టం ప‌లు ప్ర‌భుత్వాల్లో చూస్తుంటాం. దీనికి భిన్న‌మైన తీరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తారు.

రూపాయి ఆశించే చోట ఏకంగా రెండు రూపాయిలు ఇచ్చేసే వైనం కేసీఆర్ లో క‌నిపిస్తుంది. ఇచ్చేది ఏదైనా గుర్తుండిపోయేలా చేయ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆ మ‌ధ్య‌న ఉద్యోగులు జీతాల పెంపు కోసం గ‌ళం విప్పిన‌ప్పుడు.. వారు ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాన్ని తీసుకొని సంతోషంతో చిందులు వేసేలా చేశారు. తాజాగా సింగ‌రేణి కార్మికులకు డ‌బుల్ థ‌మాకాను ప్ర‌క‌టించారు. ఎప్ప‌టిలానే దీపావ‌ళి బోన‌స్‌ ను ద‌స‌రాకు ఇచ్చే విధానంతో పాటు.. ఊహించ‌ని రీతిలో ఒక్కో కార్మికుడికి ల‌క్ష రూపాయిల వ‌ర‌కూ ఖాతాల్లో జ‌మ అయ్యేలా నిర్ణ‌యాన్ని తీసుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు కేసీఆర్‌. అంతేనా.. ఎంతోకాలంగా న‌లుగుతోన్న వార‌స‌త్వ ఉద్యోగాల‌పైనా కీల‌క ప్ర‌క‌ట‌న నేడు చేయ‌నున్నారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఇచ్చే బోన‌స్ అడ్వాన్స్ ను దస‌రా ముందు అడ్వాన్స్ ఇవ్వ‌టం మామూలే. ఇప్ప‌టికే ఈ మొత్తం కార్మికుల ఖాతాల్లోకి జ‌మ అయ్యింది. కార్మికుల లాభాల కింద స‌గ‌టున రూ.15వేల నుంచి రూ.20 వేల వ‌ర‌కు.. దీపావ‌ళి బోన‌స్ గా రూ.57 వేలు జ‌మ అవుతాయి. అయితే.. మొత్తంగా రూ.ల‌క్ష మేర ప్ర‌తీ కార్మికుడికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న్న విష‌యాన్ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు లాభాల బోన‌స్ 18 శాతంగా ఉండ‌గా 2014లో తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత దాన్ని 21గా చేశామ‌ని.. తాజాగా 25 శాతం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేసీఆర్ చెప్పిన మొత్తాన్ని ద‌స‌రా పండ‌క్కి ఒక రోజు ముందే కార్మికుల ఖాతాల్లోకి జ‌మ కానుండ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా ఎందుకు చేస్తున్న‌ట్లు? అన్న సందేహానికి స‌మాధానం ఉండ‌నే ఉంది. తాజాగా సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అనుబంధ బొగ్గుగ‌ని కార్మిక సంఘం పోటీ చేస్తోంది.

ఈ సంఘానికి కేసీఆర్ కుమార్తె క‌విత గౌర‌వాధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఎన్నిక‌ను తెలంగాణ అధికార ప‌క్షం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. మంత్రులు..ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇలా టీఆర్ ఎస్ యంత్రాంగం మొత్తం సింగ‌రేణిని క‌మ్మేసింది. కార్మికుల‌కు తాము ఎంతో చేస్తామ‌ని మాట‌లు చెబుతూనే.. చేత‌ల్లో భారీ మొత్తాన్ని బోన‌స్ గా ప్ర‌క‌టించ‌టంతో పాటు.. వార‌స‌త్వ ఉద్యోగాల విష‌యంలోనూ కార్మికులు కోరుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేసేందుకు కేసీఆర్ రెఢీ అయ్యారు. ఇక‌.. సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘంలో విజ‌యం ఎవ‌రిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదేమో?