Begin typing your search above and press return to search.

కేసీఆర్ వరాలు.. పత్రికలపైన కూడా..

By:  Tupaki Desk   |   2 Sep 2018 5:31 AM GMT
కేసీఆర్ వరాలు.. పత్రికలపైన కూడా..
X
ప్రగతి నివేదన సభ.. టీఆర్ ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన పండుగ.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్ కు ఇది అతి ముఖ్యమైన సభ.. ఎక్కడా ఎలాంటి తొట్రుపాట్లు లేకుండా సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకే ఉద్యోగులు - వివిధ వర్గాలకు వరాలు కురిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడిగిన వారికి.. అడగని వారికి వరాలిచ్చేస్తున్నారు. ఏ వర్గాన్ని అసంతృప్తి పరచకుండా ప్లాన్ చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్ తో వరాల వాన కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ - పింఛన్ల పెంపు - వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతోపాటు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపనున్నారు.

అందరికీ ఇచ్చి వాటిని ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఎందుకు వదులుకుంటారు. అందుకే ఆ పని చేసేశారు.. టీఆర్ ఎస్ నేతల పేరు మీద పత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రసమితి - కేసీఆర్ చేస్తున్న పనులు, పథకాలను వివరించేలా ప్రకటనలున్నాయి. లక్షల రూపాయల విలువ చేసే ఈ యాడ్ లు ఒక్కరు ఇచ్చేంత స్థాయి మాత్రం ఉండదు.. అవన్నీ పార్టీ తరఫునే ఇచ్చారనే గుసగుసలున్నాయి. వారు సగం భరిస్తే.. మిగతా సగం పార్టీ భరించిందని టీఆర్ ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

నిజానికి కేసీఆర్ ఇలాంటి ప్రగతి నివేదన సభలు ఎన్ని పెట్టినా అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీడియానే. అందుకే ఈ సభ పేరు మీద మీడియాకు లక్షల రూపాయల విలువ చేసే ప్రకటనలు టీఆర్ ఎస్ ఇచ్చింది. దీని ద్వారా ఆయా పత్రికలు - చానెల్లు ఖచ్చితంగా అంతో ఇంతో కవరేజ్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరినీ సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో పత్రికలను - చానెళ్లను కూడా వదలకుండా కేసీఆర్ చేస్తున్న ఈ ప్రచార హోరు జనాలకు చేరువవుతోంది.