Begin typing your search above and press return to search.

కొంద‌రికి వ‌చ్చే ఓట్ల శాతాన్ని చెప్పేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:37 AM GMT
కొంద‌రికి వ‌చ్చే ఓట్ల శాతాన్ని చెప్పేసిన కేసీఆర్‌
X
మాట మీద నిల‌బ‌డ‌టం మా ఇంటి పేరు అన్న చందంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం తెలిసిందే. ఎవ‌రి మాట‌ను విన‌కుండా మొత్తంగా త‌న నిర్ణ‌యానికే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్న ఆయ‌న తాజాగా మ‌రోసారి అదే తీరును ప్ర‌ద‌ర్శించారు.

ప‌లు సందేహాల‌కు చెక్ చెబుతూ.. సిట్టింగ్ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న మాట‌ను నిల‌బెట్టుకోవ‌టం తెలిసిందే. టికెట్లు కేటాయింపులు జ‌రిగినా.. బీఫారాలు ఇచ్చేనాటికి ఆయ‌న నిర్ణ‌యంలో మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న అంచ‌నాలు వెల్లువెత్తినా.. వాటిల్లో నిజం లేద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల్లో చేసి చూపించారు. నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ మొద‌లు కావ‌టానికి ఒక రోజు ముందే పిలిపించి మ‌రీ వారి చేతుల్లో బీఫారాల్ని ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

కేసీఆర్ ప్ర‌క‌టించిన వాటిల్లో నాంప‌ల్లి స్థానానికి ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఆనంద్‌ కుమార్‌ గౌడ్ మిన‌హాయించి మిగిలిన వారంతా హాజ‌ర‌య్యారు. నాంప‌ల్లిలో అభ్య‌ర్థిని మారుస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. ఆయ‌న గైర్హాజ‌రు కావ‌టం చూస్తే.. నాంప‌ల్లికి కొత్త అభ్య‌ర్థి తెర మీద‌కు రావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బీఫారాలిచ్చే కార్య‌క్ర‌మంలో అభ్య‌ర్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన కేసీఆర్‌.. గెలుపు ధీమాను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. వంద‌కు పైగా స్థానాల్లో పార్టీ గెలుపు ఖాయ‌మ‌న్నారు. కూట‌మి కార‌ణంగా ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని.. అదో విఫ‌ల య‌త్నంగా అభివ‌ర్ణించారు. టీడీపీకి ఎవ‌రూ ఓట్లు వేయ‌ర‌న్న కేసీఆర్‌.. కొన్ని స్థానాల్లో టీఆర్ ఎస్‌ కు వచ్చే ఓట్ల శాతాన్ని చ‌దివి వినిపించారు. తాను చెబుతున్న గెలుపు ధీమా ఉత్త‌ది ఎంత‌మాత్రం కాద‌న్న రీతిలో ఆయ‌న కొన్ని స్థానాల్లో టీర్ ఎస్ కు వ‌చ్చే ఓట్ల శాతాన్ని ప్ర‌క‌టించ‌టం విశేషం.

అయితే.. టీఆర్ ఎస్ కు వ‌చ్చే ఓట్ల శాతాన్ని ప్ర‌క‌టించిన నియోజ‌క‌వ‌ర్గాలను చూస్తే.. వ్యూహాత్మ‌కంగానే కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. ఎందుకంటే.. పోటాపోటీ ఉంటుంద‌న్న మాట వినిపిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అన్న మాట ప్ర‌చారం జ‌రిగేలా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌.. రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఆట‌ల రాజేంద‌ర్ ఈసారి గ‌ట్టిపోటీ ఎదుర్కొంటున్న‌ట్లుగా చెబుతున్న‌ప్ప‌టికీ.. అదంతా ఉత్త‌మాట అని.. ఆయ‌న‌కు 81.64 శాతం మంది మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని.. అదే రీతిలో ఓట్లు శాతం న‌మోదు అవుతుంద‌న్న మాట‌ను చెప్పారు. కూట‌మి అభ్య‌ర్థికి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కూట‌మి అభ్య‌ర్థికి కేవ‌లం 17.85 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదే రీతిలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఓట‌ర్ల శాతాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన నియోజ‌క‌వ‌ర్గాలు.. అందులో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ కున్న మ‌ద్ద‌తు శాతాన్ని చూస్తే..

హుజురాబాద్ 81.64 %
హుస్నాబాద్‌ 71.50%
మానకొండూరు 48.40%
కరీంనగర్ 68.84%
వేములవాడ 51.05%
సిరిసిల్లలో 64.90%
చొప్పదండి 67.60%
కోరుట్ల 43.30%
జగిత్యాల 45.04%
ధర్మపురి 73.72%
రామగుండం 65.73%
మంథని 75.38%
పెద్దపల్లి 58.01%