Begin typing your search above and press return to search.

తెలంగాణ ఆదాయం అంత పెరిగిందట

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:21 AM GMT
తెలంగాణ ఆదాయం అంత పెరిగిందట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు సంతోషం వచ్చినప్పుడు అంతా సంతోషకరమైన వార్తలే చెబుతుంటారు. చివరకు ఆయన మాటలన్నీ సంతోషంగా ఉంటాయి. అదే సమయంలో కాస్త తేడా వస్తే చాలు అగ్గి మీద గుగ్గిలం పడినట్లుగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు రాష్ట్ర పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని.. తమది ధనిక రాష్ట్రమంటూ చాలా హుషారుగా మాటలు చెప్పే ఆయన.. మరికొన్నిసార్లు అందుకుభిన్నంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లుగా మాట్లాడతారు. అంకెల్ని చూపిస్తూ ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే.. ఎప్పటికప్పుడే అన్న చందంగా ఉంటాయన్న విమర్శ ఉంది.

తాజాగా మాత్రం తెలంగాణ రాష్ట్ర వృద్ధికి సంబంధించి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు వింటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఎందుకంటే గడిచిన రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గురించి కేసీఆర్ చెప్పిన లెక్కలు వింటే ఆనందంతో నోట మాట రాదంటే. ఎందుకంటే.. గడిచిన ఏడాదిలో ఇదే సమయానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆదాయానికి.. ఇప్పటికి మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం గమనార్హం.

గత ఏడాది కంటే ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అదనపు ఆదాయమే రూ.1656 కోట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ మొత్తాన్ని శాతాల్లో లెక్కలు చెప్పాలంటే అది 27.45గా ఆయన చెప్పుకొచ్చారు. ఆదాయంలో కావొచ్చు.. మరే అంశంలో అయినా వృద్ధి రేటు 9 శాతం ఉంటేనే గొప్పగా చెప్పుకునే దానికి 27.4శాతం అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఎక్సైజ్.. వాణిజ్యపన్నులు.. స్టాంపులు రిజిస్ట్రేషన్లు.. మార్కెటింగ్.. రవాణా ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడు సాగుతున్న దూకుడు.. ఇదే రీతిలో కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి అనుకున్న దాని కంటే అదనంగా రూ.11వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది వ్యవధిలో ఇంత భారీగా ఆదాయం రావటానికి కారణం ఏమిటి? ఇదే ఊపు మిగిలిన నెలల్లోనూ కొనసాగుతుందా? లాంటి ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అంకెల ప్రకారమైతే తెలంగాణ వెలిగిపోతున్నట్లుగా చెప్పక తప్పదు.