Begin typing your search above and press return to search.

నిర్వాసితులకు 15 వేల ఉద్యోగాలట.

By:  Tupaki Desk   |   25 July 2015 12:54 PM GMT
నిర్వాసితులకు 15 వేల ఉద్యోగాలట.
X
తనకు అవసరం వచ్చినప్పుడు.. తన పనిని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతటి ప్రకటన అయినా చేస్తారు. ఎంతటి వాడి ఇంటికి అయినా వెళతారు. ఆ తర్వాత ఎంతటి వాడిని అయినా పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తారు. ఇందుకు మరో ఉదాహరణ.. సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు 15 వేల ఉద్యోగాలు అంటూ ఆయన చేసిన ప్రకటన అని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించాలంటే పెద్ద ఎత్తున భూ సేకరణ చేయాలి. దీనితోపాటు తెలంగాణలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను రీ డిజైన్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వీటి కారణంగా తెలంగాణలోనే కొన్ని గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఆయా గ్రామాలతోటు అక్కడి పోలాలనూ సేకరించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో తెలంగాణలో భారీ ఎత్తున భూ సేకరణ చేయనున్నారు. మరి భూ సేకరణ అంటే మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు నాలుగు రెట్లు చెల్లించాలి. ఇంకా ఎన్నో ప్రయోజనాలను రైతులకు కల్పించాలి. దీనికితోడు చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో రైతులు తమ భూములను సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక, ఇంటికో ఉద్యోగం అన్నా.. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలోనే ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కనక ప్రభుత్వం మాటలను నమ్మే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఆయన సీఎంవో తరఫున తాజా వ్యాఖ్యలు చేయించారని అంటున్నారు.

నిర్వాసితులకు లష్కర్ ఉద్యోగాలు మాత్రమే కాకుండా అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తామని, 15 వేల ఉద్యోగాలను వారికి కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికే కొలువులు లేవని, హేతుబద్ధీకరణ తర్వాత రాబోయే పదేళ్ల వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశ వదులుకోవాల్సిందేనని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాత.. సూపర్ న్యూమరరీ ఉద్యోగాలు సృష్టించిన తర్వాత పది వేల కొలువులు కూడా మిగిలే అవకాశాలు లేవని, వాటిని నిరుద్యోగులకు ఇస్తే ఇక నిర్వాసితులకు కొలువులు ఎక్కడ ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితులను కూడా మోసం చేయడానికే కేసీఆర్ ఇటువంటి ప్రకటన చేస్తున్నారని విమర్శిస్తున్నారు.