Begin typing your search above and press return to search.

డీఎస్ విష‌యంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్‌?

By:  Tupaki Desk   |   28 Jun 2018 3:19 AM GMT
డీఎస్ విష‌యంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్‌?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? సీనియ‌ర్ నేత‌, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీ‌నివాస్ విష‌యంలో కేసీఆర్ వ్యూహం దెబ్బ‌తిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న సెకండ్ లైఫ్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ వైపు డీఎస్‌ను పార్టీ నుంచి పంపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతుంటే...మ‌రోవైపు ఆయ‌న‌కు సెకండ్ లైఫ్ ఇవ్వ‌డం అందులోనూ కేసీఆర్ స్వ‌యంగా ఆ చాన్స్ ఇచ్చార‌న‌డం ఏమిటని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం డీఎస్‌కు తాత్కాలికంగా న‌ష్టం జ‌రిగినా...ఆయ‌న‌కు లాంగ్ ర‌న్‌లో మేలు చేసేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు.

డీఎస్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. 3 రోజులు అక్కడే ఉన్నారు. ఇదే టీఆర్ఎస్‌ నేతల విమర్శలకు కారణమైంది. పార్లమెంట్ సమావేశాలు కానీ, వేరే ప్రత్యేక సందర్బం కానీ లేని సమయంలో డీఎస్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని డీఎస్ క్యాంప్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు జిల్లా నేతలు. ఐతే, తాను ప్రణబ్‌ను కలిసేందుకు వెళ్లానని డీఎస్ చెప్తున్నా.. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషించుకుంటున్న టీఆర్ఎస్‌ నాయకులు ఆయన కాంగ్రెస్‌కి దగ్గరవుతున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్‌ ఎంపీ కవిత నివాసంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న డీఎస్‌ను సస్పెండ్ చేయాలని నేతలు తీర్మానించారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని పార్టీ అదినేత కేసీఆర్‌కు నిజామాబాద్ జిల్లా పార్టీ తీర్మానం చేసిన అనంత‌రం ఆయ‌న‌తో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఖరారు అయిందని తొలుత మీడియాకు తెలిపారు. అనంత‌రం ర‌ద్ద‌యింద‌ని పేర్కొన్నారు. ఇలా అనూహ్య ట్విస్ట్‌లు టీఆర్ఎస్ పెద్ద‌లు ఇచ్చారు ఈ ప‌రిణామం డీఎస్‌కు మేలు చేసేద‌ని అంటున్నారు. తనంత తాను పార్టీని వీడకుండా...సస్పెండ్ తీర్మానాన్ని రాష్ట్ర పార్టీ ఆమోదిస్తే తన దారి తాను చూసుకునే ఉధ్దేశంతో డీఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నట్టు డీఎస్ వర్గం చెబుతోంది. మ‌రోవైపు డీఎస్‌ను అపాయింట్మెంట్ కోసం నిరీక్షింప‌చేయ‌డం ద్వారా కేసీఆర్ ఆయ‌న‌పై సానుభూతి పెరిగే చాన్స్ ఇస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక సీనియ‌ర్ నాయ‌కుడిని , ఉమ్మ‌డి రాష్ట్రంలో పీసీస చీఫ్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన నాయ‌కుడి విష‌యంలో గులాబీద‌ళ‌ప‌తి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆయ‌న‌కే బూమ‌రాంగ్ అవ‌డం ఖాయ‌మంటున్నారు.

ఇదిలాఉండ‌గా....డీఎస్ ప‌రిస్థితి ప్రాంతీయ పార్టీ రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంద‌ని టాక్‌. ప్రాంతీయ పార్టీ నాయ‌కుడే స‌ర్వం కాబ‌ట్టి ఇక్క‌డ గ్రూపులు క‌ట్ట‌డం, అసమ్మ‌తి వెళ్ల‌గ‌క్క‌డం వంటి జాతీయ పార్టీల రాజ‌కీయాలేవి ఉండ‌వ‌నేది ఓపెన్ సీక్రెట్‌. సీనియ‌ర్ల‌కు ప్రాంతీయ పార్టీల్లో ఇబ్బందులు త‌ప్ప‌వనేది గ‌తంలో ప‌లువురి విష‌యంలో రుజువుకాగా..మ‌రోమారు డీఎస్ విష‌యంలో అది స్ప‌ష్ట‌మైంంద‌ని అంటున్నారు.