Begin typing your search above and press return to search.

ఎంపీ..ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ ఆఫీస్ స్పెష‌ల్ క్లాస్‌!

By:  Tupaki Desk   |   11 May 2018 4:12 AM GMT
ఎంపీ..ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ ఆఫీస్ స్పెష‌ల్ క్లాస్‌!
X
ఎన్నిక‌ల‌కు బోలెడంత టైం ఉంద‌న్న‌ది కొంద‌రి మాట‌. కానీ.. చాలా ద‌గ్గ‌ర్లోకి వ‌చ్చాయ‌న్న భావ‌న‌లో ఉన్నాయి రాజ‌కీయ పార్టీలు. ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న వేళ‌.. అధికార పార్టీ నేత‌ల భ‌ద్ర‌త‌పై నిఘా వ‌ర్గం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో పాటు.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న సందేశాన్ని అధికార‌ప‌క్ష ఎంపీలు.. ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌త్యేకంగా చెప్పటం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌లువురు టీఆర్ ఎస్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు త‌మ‌కు కేటాయించిన గ‌న్ మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసేసి.. త‌మ సొంత ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. గ‌డిచిన నాలుగేళ్లుగా గ‌న్ మెన్ల‌ను ఏర్పాటు చేసుకోని నేత‌ల జాబితాను ఆయ‌న చేతికి ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రికొంద‌రు నేత‌లు గ‌న్ మెన్ల‌ను ఇంట్లోనో.. ఆఫీసు ద‌గ్గ‌రో వ‌దిలేసి ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నార‌ని.. సొంతంగా వాహ‌నాలు న‌డుపుతున్న స‌మాచారం కేసీఆర్ దృష్టికి వెళ్లింది.

గ‌డిచిన నాలుగేళ్లుగా సెక్యురిటీని నియమించ‌టానికి మ‌క్కువ చూప‌ని నేత‌ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కొంద‌రు నేత‌లు ప్ర‌భుత్వం ఇచ్చిన గ‌న్ మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి.. త‌మ సొంత సిబ్బందిని పెట్టుకోవ‌టం ఏ మాత్రం మంచిది కాద‌ని నిఘా వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రికి వారు సొంతంగా వాహ‌నాల్ని న‌డ‌ప‌టంపైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ఈ నేప‌థ్యంలో సీఎంవో సీన్లోకి వ‌చ్చింది. గ‌న్ మెన్లు లేనివాళ్లు.. ఇప్ప‌టికే గ‌న్ మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసిన వారంతా వెంట‌నే గ‌న్ మెన్ల‌ను పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేకంగా ఫోన్లు వెళ్ల‌టంలో కొంద‌రు త‌ప్ప‌నిస‌రై గ‌న్ మెన్ల‌కు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులకు కేటాయించిన గ‌న్ మెన్ల విష‌యంలో ముగ్గురు ఎంపీల తీరుపై సీఎంవో ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. వీరికి గ‌న్ మెన్ల‌ను కేటాయిస్తే.. వారిని వ‌దిలేసి అనుచ‌రుల‌తో వెళుతున్న వైనంపై సీఎంవో ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టింది. ఇదిలా ఉంటే.. నేత‌ల తీరు భ‌ద్ర‌తా సిబ్బందికి చుక్క‌లు చూపిస్తోంది. ప్ర‌భుత్వం కేటాయించిన గ‌న్ మెన్ల‌ను త‌మ‌తో తీసుకెళ్ల‌ని నేత‌ల కార‌ణంగా స‌ద‌రు గ‌న్ మెన్ల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌టంపై వారు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. చేయ‌ని త‌ప్పున‌కు శిక్ష అనుభ‌వించ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా సీఎంవో నుంచి ప్ర‌త్యేకంగా ఫోన్లు.. మొయిల్స్ వెళ్ల‌టంతో ప‌రిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.