Begin typing your search above and press return to search.

కేసీఆర్ - మోడీ ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ రైతుల‌ను ముంచేస్తున్నారా...!

By:  Tupaki Desk   |   12 Nov 2021 2:30 PM GMT
కేసీఆర్ - మోడీ ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ రైతుల‌ను ముంచేస్తున్నారా...!
X
ఆంధ్రోళ్ల పాల‌న‌లో తెలంగాణ‌కు సాగు, తాగు నీటి విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఎప్పుడూ అనేవారు. అస్స‌లు ఆంధ్రా పాల‌కులు తెలంగాణ రైతాంగాన్ని ఏనాడు ప‌ట్టించుకోలేద‌ని.. అందుకే తెలంగాణ‌లో స‌మృద్ధిగా నీటి వ‌న‌రులు ఉన్నా కూడా అస‌లు నీరు పార‌లేద‌ని.. ఇక్క‌డ రైతులు పంట‌లు పండించుకునే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించే వారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో సాగు నీటి వ‌న‌రులు పెరిగాయి. చాలా ప్రాంతాల‌కు స‌మృద్ధిగా సాగునీరు అందుతోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ పంటల సాగు కూడా పెరిగింది.

ఒక‌ప్పుడు తెలంగాణ‌లో వాణిజ్య పంట‌లు ఎక్కువుగా వేసేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఇక్క‌డ ఏపీలో ఎక్కువుగా పండే ఫామాయిల్ లాంటి పంట‌లు కూడా ఎక్కువుగా వేస్తున్నారు. తీనికి తోడు ఒక‌ప్పుడు గోదావ‌రి జిల్లాల్లో మాత్ర‌మే ఎక్కువ దిగుబ‌డి ఇచ్చే వ‌రి పంట కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా మంచి దిగుబ‌డితో పండుతోంది. అయితే ఇప్పుడు ఆ పండిన వ‌డ్లు కొనే విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం ఒక‌రిపై మ‌రొక‌రు దోబూచులాట‌కు దిగుతున్నారు.

ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ల‌బ్ధి కోసం విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారే త‌ప్పా అంతిమంగా రైతుకు ఎలా ? న్యాయం చేయాలా ? అన్న ఆలోచ‌న మాత్రం చేయ‌డం లేదు. వ‌డ్లు కొనే విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఎలాంటి ఒప్పందం ఉన్న‌ది అన్న‌ది మాత్రం ఎవ్వ‌రూ బ‌య‌ట పెట్ట‌డం లేదు. త‌ప్పు మీదంటే మీది అని నింద‌లు వేసుకుంటూ కాలం గ‌డిపేస్తున్నారు.

అస‌లు తెలంగాణ రైతాంగం పండించిన వ‌డ్లు కొంటామో లేదో బీజేపీ వాళ్లు చెప్ప‌డం లేదు. కేసీఆర్ మాత్రం అంత‌కు ముందు రైతుల పంట కొనే విష‌యంలో తాను లీడ్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం నింద బీజేపీ మీద వేసి తాను త‌ప్పించేసుకుంటున్నారు. అస‌లు ఫైన‌ల్‌గా రైతులు పండించిన వ‌డ్లు ఎవ‌రు కొంటారు ? అన్న‌ది ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. దీంతో రైతులు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌ను అమ్ముకునేందుకు దిక్కులేదు. పైగా రెండు పార్టీల నేత‌లు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

ఈ విమ‌ర్శ‌ల వ‌ల్ల ఆ రెండు పార్టీల‌కు రాజ‌కీయ ల‌బ్ధి క‌లుగుతుంది ఏమో గాని.. రైతుల‌కు మాత్రం ఎంత మాత్రం న్యాయం జ‌ర‌గ‌దు. మ‌రి ఇక‌పై అయినా రైతుల‌కు న్యాయం జ‌రిగే చ‌ర్య‌లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటాయేమో చూడాలి.