Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మోడీ, కేసీఆర్.. ఏం జరుగనుంది?

By:  Tupaki Desk   |   28 Nov 2020 3:45 AM GMT
హైదరాబాద్ లో మోడీ, కేసీఆర్.. ఏం జరుగనుంది?
X
జీహెచ్ఎంసీ ఎన్నికల కథ కంచికి చేరుతోంది. ప్రచారానికి ముగింపు వేళ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ తమ శక్తియుక్తులను అన్నింటిని కూడగట్టి మిగిలిన రెండు రోజులు హోరెత్తించేందుకు.. ప్రజలను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి. దీంతో గ్రేటర్ లో రాజకీయ వేడి బాగా పెరిగింది.

ఇక ప్రచారానికి రెండు రోజులే మిగిలింది. ఈ రెండు రోజుల్లో జనాన్ని ఆకర్షించడానికి ఇటు ప్రధాని మోడీ.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనం ముందుకు వస్తున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

ఇక బీజేపీ తరుఫున ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగనున్నారు.

శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది.

ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారట. అంతే కాకుండా ప్రధాన మంత్రికి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది.

హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. కేసీఆర్ సైతం దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది.

దుబ్బాకలో ఓటమితో బీజేపీ చెలరేగిపోతోంది. 2024లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీకి చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారనే దానిపై తెలంగాణ భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంది. ఇది కేసీఆర్ కు పరీక్ష అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ ప్రధాని, అమిత్ షాలాంటి దిగ్గజాలు హైదరాబాద్ లో ఉన్న వేళ ఈరోజు కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారు? జనాలకు ఏలాంటి వరాలు కురిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.