రాజకీయ నేతల మధ్య రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాటలు తూటాల్లా పేలుతుంటాయి. మరి.. అలాంటి అగ్రనేతలు ఎదురెదురు పడినప్పుడు ఎలా వ్యవహరిస్తారు? వారి మధ్య ఎలాంటి మాటలు నడుస్తాయన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యన పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో? చంద్రబాబును ఉద్దేశించి ఏ స్థాయిలో విరుచుకుపడతారో అందరికి తెలిసిన విషయమే.
ఏక వచనంతో.. అది కూడా పేరు పెట్టి మరీ తిట్టేసే కేసీఆర్ నోటి నుంచి మాటలు.. బండకేసి బాదినట్లుగా ఉంటాయి. అంత చురుకుగా.. సూటిగా ఉండేలా మాట్లాడే కేసీఆర్ కు చంద్రబాబు ఎదురైతే ఆయన ఎలా స్పందిస్తారు? ఆయన నోటి వెంట ఎలాంటి మాటలు వస్తాయి? ఒకనాటి తన అధినేత పట్ల కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరమే.
అందులోకి ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాల తర్వాత ఇరువురు కలిసిన వేళ.. చంద్రబాబు పట్ల కేసీఆర్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తారన్న విషయాన్ని పలు వర్గాల వారు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. తెలంగాణలో అతి శక్తివంతమైన నాయకుడిగా అవతరించి.. అవసరమైతే జాతీయ స్థాయిలోనూ కొన్ని అంశాల మీద బలంగా తన వాదన వినిపించే సత్తా ఉన్న వ్యక్తిగా కేసీఆర్ రూపాంతరం చెందుతున్న వేళ.. ఆయనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? గతంలో మాదిరే చంద్రబాబు పట్ల మర్యాదగా వ్యవహరిస్తారా? లేక.. నువ్వు.. నేను ఒకటే అన్నట్లుగా ఉంటారా? అన్న సందేహాలు చాలామంది మదిలో మెదిలే పరిస్థఇతి.
ఇలాంటి సందేహాలకు తన వైఖరితో కేసీఆర్ సమాధానాలు ఇచ్చేశారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా తన ఇంటికి ఆహ్వానపత్రం ఇచ్చేందుకు వచ్చిన చంద్రబాబును సాదరంగా ఆహ్వానించటమే కాదు.. పలు సందర్భాల్లో ‘‘అన్నా’’ అంటూ సంబోధించటం గమనార్హం. శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని బాబు కోరితే.. ‘‘అన్నా.. మీరు స్వయంగా వచ్చి ఆహ్వానించారు. తప్పకుండా వస్తా’’ అని బదులిచ్చారు.
ఇలాంటేదే మరో సందర్భాన్ని కూడా ప్రత్యక్ష సాక్ష్యులు ప్రస్తావిస్తున్నారు. అమరావతి పర్యటన పక్కా అన్న విషయాన్ని నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? అని సరదాగా కేసీఆర్ ను చంద్రబాబు అడిగితే.. ‘‘అన్నా.. మీరే చెప్పండి’’ అని బదలిచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తమ వద్దకు వచ్చిన కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఆహ్వానం అందింది కదా?’’ అని అన్నప్పుడు.. ‘‘వచ్చింది అంకుల్’’ అంటూ కేటీఆర్ బదులివ్వటం గమనార్హం.
రాజకీయ వైరంతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే ఇరువురు అగ్రనేతలు విడిగా కలిసినప్పుడు అద్యంతం గౌరవంగా.. మర్యాదగా మాట్లాడటం గమనించాల్సిన అంశం. రాజకీయాల్లో ఎంత ఎత్తు ఎదిగినా.. గతంలో తనకు బాస్ గా ఉన్న వ్యక్తి పట్ల ఎంతోకొంత ఆ మర్యాదను ప్రదర్శిస్తారన్న మాటకు నిదర్శనంగా చంద్రబాబును ఉద్దేశించి.. ‘‘అన్నా’’ అన్న సంబోధన నిదర్శనంగా చెప్పొచ్చు.