Begin typing your search above and press return to search.

హైలెట్ సీన్: ఒకొరికొక‌రు తినిపించుకున్నారు

By:  Tupaki Desk   |   2 Jun 2019 5:57 AM GMT
హైలెట్ సీన్: ఒకొరికొక‌రు తినిపించుకున్నారు
X
మాట‌లు తూటాల్లా పేల‌టం.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌ల వేడి పీక్స్ కు వెళ్ల‌టం.. టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన‌టం నిన్న‌టి మాట‌గా మారింద‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు అయితే అయ్యాయి కానీ.. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న భావ‌న ఎక్క‌డా క‌ల‌గ‌ని ప‌రిస్థితి. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఇద్ద‌రు చంద్రుళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులుగా ఉన్న వేళ‌.. వారి మ‌ధ్య అనుబంధం ఏ తీరులో సాగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఐదేళ్ల‌లో త‌ర‌చూ ఏదో ఒక పంచాయితీ రెండు రాష్ట్రాల మ‌ధ్య న‌డిచేది. తాజాగా అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం చేసిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వ‌చ్చేశాయి. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి మూడు రోజులే అయినా.. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం గ‌డిచిన ఐదేళ్ల‌లో క‌నిపించ‌నంత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో ఇరువురు ముఖ్య‌మంత్రులు ఉన్నార‌న్న భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నిర్వ‌హించిన ఇఫ్తార్ విందుకు హాజ‌రైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. స‌న్నిహితంగా ఉండ‌టం అక్క‌డి వారంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇఫ్తార్ విందులో భాగంగా కేసీఆర్ కు పండును జ‌గ‌న్ తినిపించ‌గా.. జ‌గ‌న్ కు కేసీఆర్ తినిపించారు. ఇరువురి మ‌ధ్య నెల‌కొన్న స‌హృద్బావ వాతావ‌ర‌ణం క‌నుల పండువ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ సీన్ ఇఫ్తార్ విందుకే హైలెట్ గా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.