Begin typing your search above and press return to search.

కేసీఆర్ దూకుడు.. చంద్రబాబు నాన్చుడు

By:  Tupaki Desk   |   6 Sep 2018 2:30 PM GMT
కేసీఆర్ దూకుడు.. చంద్రబాబు నాన్చుడు
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరి తీరు గమనిస్తే ఒకరిలో దూకుడు కనిపిస్తుంటే మరొకరిలో నాన్చుడు ధోరణి కనిపిస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న కేసీఆర్ అనుకున్నట్లు అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఎవరూ ఊహించనట్లుగా ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను డిఫెన్సులోకి నెట్టేశారు.

మరోవైపు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు ముందస్తు ఆలోచనలు చేసినప్పటికీ తరువాత ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. చంద్రబాబు ఈ విషయంలో నాన్చుడు ధోరణిలోనే ఉన్నట్లు చెబుతున్నారు.

కేంద్రంతో.. ముఖ్యంగా మోదీతో సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టిన నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీ రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు సహకరించినట్లుగా కేంద్రం నుంచి తనకు సహకారం ఉండదన్న భయం ఆయనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం ఎన్నికలు రాకుండా ఏమైనా చక్రం తిప్పితే అప్పుడు తన పరిస్థితేంటన్నది ఆయన భయంగా తెలుస్తోంది.

అయితే.. కేసీఆర్ కూడా ముందస్తు ఆలోచన చేసినప్పుడు ఈ విషయంలో ఆందోళన చెందినప్పటికీ వ్యూహాత్మకంగా మోదీతో పలుమార్లు భేటీ అయి ఆయన సహకారం పొందేలా మాట్లాడుకున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నమాట. ఆ క్రమంలోనే ఆయన ఫెడరల్ ఫ్రంట్ మాటను కూడా పక్కనపెట్టేశారు. ఇంతకుముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట కాస్త హడావుడి చేయడంతో మోదీకి ఆయనకు మధ్య దూరం పెరిగింది. కానీ.. కేసీఆర్ ఆ సమస్యను ఇట్టే పరిష్కరించుకుని మోదీతో సయోధ్య పెంచుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి లెక్క ప్రకారం ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరిగే పరిస్థితులు సృష్టించుకున్నారు. దీంతో ఆయనకు ఎలాంటి భయం లేకుండా పోయింది. పైగా అభ్యర్థులను కూడా వెంటనే ప్రకటించి మరుసటి రోజు నుంచే ప్రచార పర్వం కూడా మొదలుపెడుతుండడంతో ప్రత్యర్థులకు ఊపిరి తీసుకునే అవకాశమూ దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఇందుకు భిన్నంగా చంద్రబాబు ఇంకా ఎన్నికల విషయంలో కానీ, ప్రచార వ్యూహాల విషయంలో కానీ, పొత్తుల విషయంలో కానీ ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తో చేయిచేయి పట్టుకుని సాగుతున్నా కూడా పొత్తు ఖాయం చేసుకోలేదు ఇంతవరకు. దీంతో టీడీపీ నేతలు తమ అధినేత నాన్చుడి ధోరణి చూసి ఆందోళన చెందుతున్నారట.