Begin typing your search above and press return to search.

చంద్రుళ్లకు ‘తెలుగు’ దిగులు లేదా?

By:  Tupaki Desk   |   3 Oct 2015 4:40 AM GMT
చంద్రుళ్లకు ‘తెలుగు’ దిగులు లేదా?
X
తెలుగు ప్రజల కోసమే తాము ఉన్నట్లు.. వారి అభ్యున్నతి కోసం ఏమైనా చేస్తామని చెప్పేస్తుంటారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రళ్లు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. కొన్ని అంశాల్లో వారి తీరు చూస్తే.. అస్సల పట్టించుకోనట్లుగా ఉంటుంది. ఒక తెలుగోడిగా ఉండాల్సిన భాషాభిమానం ఇద్దరికి ఉన్నట్లుగా కనిపించదు.

తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు భాషను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై తెలుగువారంతా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవటాన్ని వారు నిరసిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలు.. కేంద్రం నుంచి ప్రత్యేకహోదా సాధించటం.. అప్పుల నుంచి విముక్తి కావటం.. నిత్యవసర వస్తువుల తగ్గింపు లాంటివి ఇప్పటికిప్పుడు చేయటం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. అమ్మ భాష విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఇద్దరు చంద్రుళ్లు వ్యక్తిగతంగా తీసుకుంటే.. తమిళనాడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోదా? తమిళుల దాహాన్ని తీర్చటానికి తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇచ్చే తెలుగువారి తెలుగు భాషను తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటమేమిటని అడిగితే.. తమిళులు స్పందించకుండా ఉంటారా?

ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగిస్తే సరిపోయే దానికి.. తెలుగు బోధనను నిలిపివేయటం ఏమిటని అడిగితే తమిళ సర్కారు వెనక్కి తగ్గకుండా ఉంటుందా? ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. భాషాభిమానం లాంటివి చంద్రుళ్ల ఇద్దరిలోనూ కనీసం లేకపోవటం శోచనీయం. ఒకప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగు వారికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించటం లేదంటే.. వ్యక్తిగత హోదాలో ప్రయత్నిస్తే.. సాధ్యం కానిది ఉంటుందా? సంకల్పమే లేనప్పుడు సమస్యకు పరిష్కారం కుదరదు కదా.