Begin typing your search above and press return to search.

ఈ చంద్రుళ్ల‌కు ఆ ఢిల్లీ అంటే అంత ఇష్టం ఎందుకో?

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:20 AM GMT
ఈ చంద్రుళ్ల‌కు ఆ ఢిల్లీ అంటే అంత ఇష్టం ఎందుకో?
X
కాస్త వాటంగా గాలి వీసినంత‌నే మాట‌ల్లో తేడా ఎంతలా ఉంటుంద‌న్న విష‌యం కేసీఆర్ తాజా మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. మిగిలిన వారికి టీఆర్ఎస్ అధినేత‌.. కాబోయే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఒక‌టి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. మిగిలిన అధినేత‌ల మాదిరి ఎప్పుడు ప‌డితే అప్పుడు మాట్లాడ‌టం అస్స‌లు ఉండ‌దు. స‌మ‌యం.. సంద‌ర్భం చూసుకొన ఆయ‌న ముచ్చ‌ట్లు చెబుతుంటారు.

తిరుగులేని అధిక్యంతో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ దూసుకెళ్లిన వేళ‌.. ఆయ‌న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా మార్చ‌నున్నాను? ఇప్పుడున్న స‌మ‌స్య‌ల్ని ఎలా అధిగ‌మిస్తాన‌న్న విష‌యానికి మించి.. జాతీయ రాజ‌కీయాల్లో తాను చ‌క్రం తిప్ప‌నున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. క‌ల‌లు క‌న‌టం.. వాటిని గొప్ప‌గా చేసి చెప్పుకోవ‌టం కేసీఆర్‌ కు కొత్తేం కాదు. ఆయ‌న మ‌దిలో ఏదైనా విష‌యం వ‌స్తే.. దాని మీద ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతూ.. భారీ సినిమాను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తారు.

ఎక్క‌డి దాకానో ఎందుకు గొర్రెల ముచ్చ‌టే చూద్దాం. ఆయ‌న చెప్పిన‌ట్లుగా గొర్రెల విష‌యంలో జ‌రిగి ఉంటే.. ఈపాటికి గొర్రెల కార‌ణంగా వ‌చ్చే డ‌బ్బులు తెలంగాణ ఖ‌జానాకు మ‌స్తు రావాలి. కానీ.. రాలేదు. అమ్మ భాష‌.. తెలుగు విష‌యంలో ఏదేదో చేస్తాన‌ని గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో చెప్పిన పెద్ద మ‌నిషి.. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ళ్లీ ఆ ఊసు ఎత్త‌క‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్ మాట‌ల‌కు.. చేత‌ల‌కు ఏ మాత్రం పొంత‌న ఉండ‌దు.

కానీ.. ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజ‌కీయాల్లో తన ముద్ర ఏమిటో చూపిస్తాన‌ని.. దేశానికి రోగం ప‌ట్టింద‌ని.. కాంగ్రెస్‌.. బీజేపీయేత‌ర కూట‌మిని ఏర్పాటు చేయ‌ట‌నున్న‌ట్లు చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాల్ని తాను ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రెస్ మీట్లో చెబుతాన‌న్నారు.

హ‌స్తిన మీద మోజు ఇద్ద‌రు చంద్రుళ్ల‌లోనూ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. రాజ‌కీయంగా త‌మ‌కు తిరుగులేద‌ని చెప్పే ప్ర‌తి క్ర‌మంలోనూ త‌మ దృష్టి ఢిల్లీ మీద‌న ఉంద‌ని.. అక్క‌డ చ‌క్రం తిప్పే విష‌యంలో త‌మ‌కున్న ఆస‌క్తిని వారు చెప్పేస్తుంటారు. ఓప‌క్క సొంత రాష్ట్రంలో రాజ‌కీయంగా స‌వాళ్లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఢిల్లీ చ‌క్రం తిప్పేయ‌టం చూస్తున్న‌దే. అయితే.. ఆయ‌న వ్య‌వ‌హార‌మంతా రోటీన్ త‌ర‌హాలో ఉంటుంది. అయితే.. బీజేపీ..కాదంటే కాంగ్రెస్ అన్న ధోర‌ణిని బాబు ప్ర‌ద‌ర్శిస్తూ.. రొడ్డు కొట్టుడు రాజ‌కీయాల్లో నుంచి బాబు బ‌య‌ట‌కు రాలేరా? అన్న క్వ‌శ్చ‌న్ తెలుగోళ్ల మ‌న‌సుల్లో అనుకునేలా చేస్తుంటారు.

చంద్ర‌బాబుతో చూస్తే.. కేసీఆర్ తీరు భిన్నంగా ఉంటుంది. ఆయ‌న అవ‌కాశాలు వెతుక్కోరు. అవ‌కాశాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాజాగా ఆయ‌న మాట‌లు చూస్తే.. జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పేందుకు వీలుగా సెంటిమెంట్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. రాజ‌కీయంగా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి.. ఊహ‌కు అంద‌ని క‌ల‌లు క‌న‌టానికి ఇష్ట‌ప‌డే ఆయ‌న జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెస్ యేత‌ర కూట‌మిని నిర్మించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

అయితే.. ఆయ‌న ఎవ‌రిని అయితే భాగ‌స్వామ్య ప‌క్షాలుగా అనుకుంటున్నారో.. వారంతా కేసీఆర్ మాదిరి మొర‌టు.. ముదురు రాజ‌కీయాలు చేసే వారే. కాకుంటే వారంతా ప్ర‌జాభిమానాన్ని సొంతం చేసుకున్న వారే కావ‌టం కొంత‌లో కొంత బెట‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. అన్ని క‌ట్ల పాముల్ని ఒక చోట‌కు చేర్చి.. వాటికి చిక్క‌కుండా తాను అనుకున్న రీతిలో వాటిని ఆడిస్తారా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

అసాధ్య‌మ‌నుకున్న ప్ర‌తి అంశాన్ని స‌వాలుగా తీసుకొని మ‌రీ.. సాధించిన కేసీఆర్ సామ‌ర్థ్యాన్ని ఇప్పుడు అంద‌రూ ఎక్కువ‌గా ఊహించుకుంటారు. ఇందుకు కేసీఆర్ సైతం మిన‌హాయింపు కాదు. కానీ.. అన్నిసార్లు ఒకేలాంటి జిమ్మిక్కులు న‌డ‌వ‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యం ప్ర‌భుత్వంలో కీల‌క స్థానాల్లో ఉన్న వారికి మాత్ర‌మే బాగా తెలుసు. అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని బ‌య‌ట ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్న కేసీఆర్‌.. త‌మ తియ్య‌టి మాట‌ల‌తో ప్ర‌జ‌ల దృష్టిని అలాంటి అంశాల మీద ప‌డ‌కుండా చేయ‌టంలో విజ‌యం సాధిస్తున్నారు.

అయితే.. అన్ని రోజులు మ‌న‌వి కావ‌న్న‌ట్లే.. ఎన్ని రోజులు ఈ తీరును ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా మేనేజ్ చేయ‌గ‌లుగుతార‌న్న‌దే ప్ర‌శ్న‌. అది సాగినంత కాలం కేసీఆర్ పాడిందే పాట‌. ఆడిందే ఆట‌. ఆ విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. చివ‌ర‌గా ఒక్క విష‌యం. పోరాడి సాధించిన తెలంగాణ‌ను గ‌ట్టెక్కించ‌కుండా.. వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేని విధంగా త‌యారు చేయ‌కుండా హ‌స్తిన మీద అంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌టం చూస్తే.. ఏపీ చంద్ర‌బాబుకు.. తెలంగాణ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు పెద్ద వ్య‌త్యాసం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రు చంద్రుళ్లు వేర్వేరుగా ఢిల్లీ చ‌క్రం తిప్పాల‌నుకుంటున్నారు. మ‌రి.. ఈ విష‌యంలో ఏ చంద్రుడు స‌క్సెస్ అవుతార‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఢిల్లీ చ‌క్రాన్ని తిప్పాల‌ని తెగ మోజును ప్ర‌ద‌ర్శించే ఇద్ద‌రు చంద్రుళ్లు తాము అనుకున్న‌ది సాధిస్తారా? లేక‌.. వీరేనే తిప్పేసే ప‌రిస్థితుల్ని కొని తెచ్చుకుంటార‌న్న దానికి కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం చెబుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.