Begin typing your search above and press return to search.

సేమ్‌ పించ్‌; చంద్రుళ్లలో మరొకటి కలిసింది

By:  Tupaki Desk   |   27 Jun 2015 8:17 AM GMT
సేమ్‌ పించ్‌; చంద్రుళ్లలో మరొకటి కలిసింది
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే తానులో ముక్కలేనని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. కొన్ని విషయాల్లో తప్పించి.. వారిద్దరి ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉంటాయని.. ఒకనాటి గురుశిష్యుల మధ్య పోలికలు లేకుండా ఉంటాయా అని వ్యాఖ్యలు చేసే వారుంటారు. కొన్ని అంశాల్లో ఇద్దరిని పోలిక చూస్తే.. వారిలో కొన్ని విషయాలు చాలా విచిత్రంగా కలుస్తుంటాయి.

ప్రభుత్వ పాలనలోనే కాదు.. కొన్ని నిర్ణయాల విషయంలో ఇద్దరూ ఒకేలా వ్యవహరించే విషయం తెలిసిందే. తాజాగా తన అవసరాల కోసం రూ.5కోట్లతో ఒక బుల్లెట్‌ ఫ్రూప్‌ బస్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తయారు చేయించుకుంటున్నారు.

జిల్లా పర్యటలనకు వెళ్లే సందర్భంలో దీన్ని వినియోగించాలని భావిస్తున్నారు. పన్నెండు మంది ప్రయాణించే అవకాశం ఉన్న ఈ బస్సుతో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు.. జిల్లా పర్యటనలకు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. సకల సౌకర్యాలుండే ఈ బస్సును ప్రస్తుతం చండీగఢ్‌లో తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి బస్సునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వినియోగించటం. ఆయన జిల్లా పర్యటనకు వెళ్లిన సమయాల్లోనే కాదు.. విశాఖను ఊపేసిన హుదూద్‌ తుఫాను సమయంలో ఇలాంటి బస్సులోనే ఆయన విశ్రమించి.. దాదాపు వారానికి పైగా అందులో నుంచే తన కార్యకలాపాలు నిర్వహించటం తెలిసిందే. సరిగ్గా అలాంటి బస్సునే తెలంగాణ చంద్రుడు తయారు చేయించుకోవటం గమనార్హం.