Begin typing your search above and press return to search.

ఇద్దరు చంద్రుళ్ల మీద మాయని మచ్చ పడింది

By:  Tupaki Desk   |   4 Feb 2016 5:52 AM GMT
ఇద్దరు చంద్రుళ్ల మీద మాయని మచ్చ పడింది
X
కాస్త కుడి ఎడంగా ఒకేలాంటి సంఘటనలు.. అనుభవాలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుళ్లకు ఎదురుకావటం కొత్తేం కాదు. వరంగా మారే అంశాలే కాదు.. శాపాలుగా మారేవి కూడా కాస్త అటూఇటూగా ఇద్దరికి ఏకకాలంలో జరగటం ఈ మధ్యన తరచూ చూస్తున్నదే. తాజాగా రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇద్దరు చంద్రుళ్లకు శాపంగా మారటమే కాదు.. వారి సమర్థతపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయని చెప్పాలి.

ఈసారి ఎదురుదెబ్బ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదట ఎదురైంది. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారటం.. రత్నాచల్ రైలును కాల్చేయటం.. తునిలో రెండు పోలీస్ స్టేషన్లను దగ్థం చేయటం.. పలు వాహనాలకు కాల్చేయటం లాంటి దారుణ ఘటనలుచాలానే చోటుచేసుకున్నాయి. కాపు ఐక్య గర్జన సభను నిర్వహిస్తున్న తీరు.. దాని కారణంగా ఏదైనా విపరిణామాలు చోటు చేసుకుంటే ఏం చేయాలన్న అంశంపై బాబు సర్కారు తప్పు చేసిందన్న భావన వ్యక్తమైంది. తుని ఘటన బాబు సర్కారుపై మచ్చగా మారింది.

తుని ఇష్యూ ఆదివారం చోటు చేసుకుంటే.. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురుకావటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో మజ్లిస్ పార్టీ రెచ్చిపోవటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీని ఆయన ఇంట్లోనే మజ్లిస్ ఎమ్మెల్యే బలాల దూసుకెళ్లి తోసేయటం.. ఆయన ఇంటిపైకి దాడికి యత్నించటం.. ఉప ముఖ్యమంత్రి కుమారుడిపై దాడికి పాల్పటంతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ పై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేయి చేసుకున్నారు. ఇక.. మరో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీను మజ్లిస్ పార్టీ కార్యకర్తలు కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేయటం గమనార్హం. ఇక.. బీజేపీ తదితర పార్టీ నేతలపైనా గ్రేటర్ పోలింగ్ సందర్భంగామజ్లిస్ దాడులు చేయటం హాట్ టాపిక్ గా మారింది. సమర్థుడైన ముఖ్యమంత్రిగా పేరొంది.. ఎవరినైనా కంట్రోల్ చేసే సత్తా ఉందని భావించే కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మజ్లిస్ ఎప్పుడూ లేని విధంగా చెలరేగిపోవటం పెను సంచలనంగా మారింది.

మిత్రపక్షానికి చెందిన కీలక నేతపైనా దాడి చేసినా.. ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారన్న అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. మొత్తానికి తుని ఇష్యూలో చంద్రబాబుకు.. గ్రేటర్ పోలింగ్ ఇష్యూలో మజ్లిస్ రౌడీయిజం కేసీఆర్ కు శాపంగా మారి.. వారి పరపతిని దెబ్బ తీశాయన్న భావన వ్యక్తమవుతోంది.