Begin typing your search above and press return to search.

దత్తపుత్రిక పెళ్లికి వెళ్లకపోవటమా సీఎం సారూ?

By:  Tupaki Desk   |   29 Dec 2020 4:16 AM GMT
దత్తపుత్రిక పెళ్లికి వెళ్లకపోవటమా సీఎం సారూ?
X
మాట అనటం చాలా తేలిక. దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. ఆ విషయం తాజాగా చోటు చేసుకున్న వైనంతో చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది. సవతితల్లి నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయిని.. తన దత్తపుత్రికగా స్వీకరించటం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్నారు. ఏదో మాట వరసకు దత్తపుత్రిక అన్న మాట కాకుండా.. ఏకంగా ఆమెను తన నివాసానికి పిలిచి.. కలిసి భోజనం చేయటం.. ఇకపై ఆమె తన ఇంట్లో సభ్యురాలని.. తన పిల్లల మాదిరే తనను చూసుకుంటానని హామీ ఇవ్వటాన్నిచాలామంది హర్షించారు.

మాట వరసకు దత్తపుత్రిక అన్నట్లు కాకుండా ఆమె బాగోగుల్ని ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తున్న కేసీఆర్.. తీరా పెళ్లి వద్దకు వచ్చేసరికి మాత్రం.. హాజరు కాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దత్తపుత్రిక కాబట్టే.. వెళ్లలేదు.. అదే సొంత కూతురైతే పెళ్లికి వెళ్లకుండా ఉంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దత్తపుత్రికను సొంత కుమార్తెతో పోలుస్తారా? అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నా.. అసలు.. కొసరు అన్న తేడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నది మర్చిపోకూడదు.

గడిచిన మూడు.. నాలుగు రోజులుగా కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహానికి సంబంధించిన వార్తలు మీడియాలో జోరుగా వస్తున్నాయి. సోమవారం రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. మహిళా.. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. క్త్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లికుమార్తె ప్రత్యూష మెడలో పెళ్లికొడుకు చరణ్ రెడ్డి తాళి కట్టారు. దాదాపురెండు గంటల పాటు శాస్త్రోక్తంగా వివాహ వేడుక సాగింది.

పెళ్లి కుమార్తె తరఫున సాక్షిగా మహిళా.. శిశు సంక్షేమ శాఖ కమిషననర్ దివ్య దేవరాజన్ సంతకం చేయగా.. వరుడి తల్లి తరుఫున అతడి చల్లి మేరీ సాక్షి సంతకం చేశారు. పెద్ద ఎత్తున అధికారులు.. నేతలు హాజరైన ఈ పెళ్లి వేడుకకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైతే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపించింది. పెళ్లి కుమార్తెను చేసే సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ.. స్వయంగా వెళ్లి.. పట్టువస్త్రాలు.. డైమండ్ నెక్లస్ బహుకరించి.. ఆశీర్వదించి రావటం గమనార్హం. సారు దత్తపుత్రిక పెళ్లి వేడుక ఎపిసోడ్ లో ఎక్కడా కుమారుడు కేటీఆర్ కానీ.. కుమార్తె కవిత కానీ కనిపించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తుండటం గమనార్హం. దత్తపుత్రిక అన్న మాటకు తగ్గట్లే.. పెళ్లి వేడుకకు హాజరై ఉంటే నిండుతనంతో పాటు.. తాను అన్న మాట మీద ముఖ్యమంత్రి ఎంతలా నిలబడతారన్న విషయం అర్థమయ్యేదన్న మాట వినిపిస్తోంది. ఈ ఇష్యూలో కేసీఆర్ తప్పు చేశారంటారా?