Begin typing your search above and press return to search.

మండలి ఎన్నికల్లో కేసీఆర్ ఛాన్సు ఇచ్చేదెవరికి?

By:  Tupaki Desk   |   14 Nov 2021 6:30 AM GMT
మండలి ఎన్నికల్లో కేసీఆర్ ఛాన్సు ఇచ్చేదెవరికి?
X
తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావటం.. ఎన్నికల షెడ్యూల్ డిసైడ్ చేయటం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నిక జరిగిన తర్వాత స్థానిక సంస్థల ద్వారా మరో పన్నెండు మందిని ఎంపిక చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసే ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విడుదల చేయనున్నారు.

ఇక.. స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే అభ్యర్థుల వివరాల్ని ఈ నెల 22న వెల్లడించే వీలుందని చెబుతున్నారు. రెండు దఫాలుగా జరిగే ఎన్నికల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటంతో పాటు.. మారిన రాజకీయానికి అనుగుణంగా.. సామాజిక సమీకరణాల్ని పక్కాగా పాటించినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యేల ద్వారా ఎంపికయ్యే ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఒక్కో అభ్యర్థికి మద్దుతుగా పది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాల మీద సంతకం చేయాల్సి ఉంది. మొత్తం ఆరు స్థానాలకు అరవై మంది ఎమ్మెల్యేల అవసరం ఉండటంతో.. వారందరికి ఇప్పటికే సమాచారం ఇవ్వటంతో పాటు.. హైదరాబాద్ కు వచ్చేయాలన్న సందేశాన్ని పంపినట్లుగా చెబుతున్నారు. దీంతో.. నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

అసెంబ్లీలో టీఆర్ఎస్ బలాన్ని చూస్తే.. మొత్తం 119 మంది సభ్యుల్లో 103 మంది గులాబీ ఎమ్మెల్యేలు ఉంటే.. ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ సొంత సీట్లతో పాటు మిత్రుడైన మజ్లిస్ కు కలుపుకొని మొత్తం 110 మంది ఎమ్మెల్యేల మద్దతు టీఆర్ఎస్ కు ఉంది. దీంతో.. తాజాగా జరుగుతున్న ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలతోపాటు.. స్థానిక సంస్థలకు జరిగే 12 స్థానాల్ని సైతం తన ఖాతాలో వేసుకునే అవకాశం టీఆర్ఎస్ కు ఉంది.

ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించిన కేసీఆర్ డిసైడ్ చేసిన అభ్యర్థుల్లో..
1. ఎర్రోళ్ల శ్రీనివాస్
2. మాజీ ఎంపీ సీతారాం నాయక్.. మాజీ ఛైర్మన్ ధరావత్ గాంధీ నాయక్ లో ఒకరికి.
3. ఎల్ రమణ
4. మధుసూదనాచారి
5. ఆకుల లలిత.. పీఎల్ శ్రీనివాస్ లో ఒకరికి
6. ఎంసీ కోటిరెడ్డి.. అల్లీపురం వెంకటేశ్వరెడ్డిలో ఒకరికి
స్థానిక సంస్థల కోటాలో గులాబీ అభ్యర్థులుగా అవకాశం పొందేటోళ్లు ఎవరంటే..
1. జూపల్లి క్రిష్ణారావు
2. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
3. తేరా చిన్నపరెడ్డి
4. కల్వకుంట్ల కవిత
5. కసిరెడ్డినారాయణరెడ్డి
6. శంభీపూర్ రాజు
7. వి.భూపాల్ రెడ్డి
8. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
9. కర్నె ప్రభాకర్
10. బోడకుంటి వెంకటేశ్వర్లు
11. నేతి విద్యాసాగర్ రావు
12. పాడి కౌశిక్ రెడ్డి

- ఇప్పటికే గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్న ప్రయత్నం చేయటం.. అందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న వేళ.. గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటా ద్వార ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డిని స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.